Jr NTR New Political Party Rumoursరాజకీయంగా తెలుగుదేశం పార్టీ నుండి దూరంగా జరిగిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పై అనేక పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. పలు సందర్భాలలో ఈ పుకార్లను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్, మరికొన్ని సందర్భాలలో మాత్రం మౌనంగా ఉండిపోయారు. అయితే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ కేవలం తన సినిమాల పైనే దృష్టి పెట్టడంతో, రాజకీయాల ప్రస్తావన ఎక్కడా రాకపోయింది. ప్రస్తుతం కూడా తన తదుపరి సినిమాల పైనే జూనియర్ ఫోకస్ చేస్తూ దర్శకులను ఎంపిక చేసుకునే పనిలో మునిగితేలుతున్నాడు.

అయితే జూనియర్ గత చిత్రం “జనతా గ్యారేజ్” విడుదలై, సూపర్ హిట్ అయ్యి దాదాపుగా నాలుగు మాసాలు గడుస్తున్నా, తదుపరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో, మరొకసారి ‘బుడ్డోడు’ రాజకీయ ప్రస్తావన తెరపైకి వచ్చింది. అయితే ఈ సారి వచ్చిన పుకార్లు సాధారణ రీతిలో లేవు… కొడితే కుంభస్థలమే కొట్టాలి అన్నట్లుగా జూనియర్ పై సరికొత్త ప్రచారానికి తెరలేపారు. బహుశా జూనియర్ ఎన్టీఆర్ కైనా ఈ విషయం తెలుసో లేదో గానీ, ‘యంగ్ టైగర్’ ఓ సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నాడట.

ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను జరుపుతున్నాడని, అందుకే సినిమాలకు కొంతకాలం బ్రేక్ తీసుకున్నాడని, జూనియర్ పార్టీ స్థాపించిన వెంటనే, బుడ్డోడు పక్షాన చేరిపోవడానికి అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిపి దాదాపు ఓ 50 మంది దాకా ఉన్నారని, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతో వచ్చే ఎన్నికలు ‘నాలుగు స్తంభాలాట’గా మారతాయని జరుగుతున్న ప్రచారం వినడానికి విస్తుగొలిపే విధంగా ఉన్నప్పటికీ, కావాల్సినంత హాస్యాన్ని పండించడంలో సక్సెస్ అయ్యింది.

జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ గా చేసుకుని విషప్రచారానికి తెరలేపారో ఏమో గానీ సోషల్ మీడియాలో ‘బుడ్డోడు’కు కాస్త వ్యతిరేక నినాదాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ మీడియా ప్రతినిధి ఫోటో పెట్టుకుని, తారక్ కు వ్యతిరేకంగా అనేక ట్వీట్లు చేసిన ఉదంతం వెలుగు చూసింది. దీంతో కావాలనే ఎవరో జూనియర్ ను టార్గెట్ చేస్తూ ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని ‘యంగ్ టైగర్’ అభిమానులు మండిపడుతున్నారు. అయితే పుట్టించే పుకార్లలో కూడా కాస్త విజ్ఞత లేకపోవడం గమనించదగ్గ విషయమే.

ఎవరు ఒప్పుకున్నా… లేకున్నా… ప్రస్తుతం ఉన్న నందమూరి హీరోలలో కాస్త తెలివితేటలు గల హీరో ఎవరూ అంటే… అది ఒక్క తారక్ అని చెప్పాలి. మరి అంతటి తెలివితేటలు కలిగిన తారక్, ఉజ్వల భవిష్యత్తు ఉన్న సినీ రంగాన్ని వదిలిపెట్టి, రాజకీయ రంగం వైపుకు అడుగులు వేస్తారంటే… అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. అందులోనూ గతంలో రాజకీయ రంగంలో జరిగిన అనుభవాల దృష్ట్యా… ఇప్పట్లో పాలిటిక్స్ అంటే ‘నో ఎంట్రీ’ అనే అవకాశమే కనపడుతోంది.

అయితే ఈ పుకార్లు పుట్టుకు రావడానికి కారణమేంటి? అంటే… జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఓ మూడు, నాలుగు నెలలు విరామమే అని చెప్పాలి. ఈ మూడు, నాలుగు నెలల ఖాళీ సమయాలలో కొత్త రాజకీయ పార్టీకి సన్నాహాలు చేసారంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారమంతా చివరికి ఒట్టి ‘పుకారు’గా మిగిలిపోవడం ఖాయం.