Jr NTR Maternal uncle Narne Srinivas Rao joining YSRCPఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఏపీలో సంచలనాలు నమోదు అవుతున్నాయి. అధికార పార్టీ నుండి ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలలో కూడా నార్నే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సెగ ఎన్టీఆర్ కు కూడా తగిలింది.

గత కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఉద్దేశపూర్వకంగానే మామను వైఎస్సాఆర్ కాంగ్రెస్ వైపునకు పంపారని ఆరోపణలు వచ్చాయి. అయితే వివాదాల కారణంగానో మారే కారణంగానో ఆయన రాజకీయ అరంగేట్రం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయంలో ఆయన జగన్ ను కలవడం ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకు కలిశారని మీడియా ఆయనను ప్రశ్నించగా.. జగన్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని నార్నె శ్రీనివాసరావు బదులిచ్చారు. హరికృష్ణ హఠాన్మరణం అనంతరం ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి కాస్త దగ్గరయ్యారు.

ఆయనకు బాలయ్య కుటుంబానికి కొంత రాకపోకలు పెరిగాయి. అయితే ఆయన పార్టీకి మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇటీవలే ఆయన అక్క నందమూరి సుహాసిని కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే జూనియర్ ప్రచారానికి కూడా వెళ్ళలేదు. కేవలం ట్విట్టర్ లో మద్దతు ఇవ్వడంతోనే సరిపెట్టారు. ఈ క్రమంలో మామ చేసిన ఈ పని ఎన్టీఆర్ కు కొత్త చిరాకు తెచ్చిపెడుతుందా? జూనియర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే సంవత్సారం ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.