Jr NTR - Mahesh babu - New Lookతమ అభిమాన హీరోలను కొత్తగా, సరికొత్తగా చూడాలని ఏ అభిమానికి ఉండదు. ఆ అభిమానుల కోరికలు తీర్చేందుకు మన హీరోలు కూడా వాళ్ళ శక్తికి మించి కష్టపడుతున్నారు. రాబోయే కాలంలో తమ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులు పూర్తి స్థాయిలో మేకోవర్ కానున్నారు. తన తదుపరి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ను చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా విడుదల చేయగా, మహేష్ న్యూ లుక్ శాంపిల్ ఆదివారం నాడు దర్శనమిచ్చింది.

ఇద్దరు పెద్ద హీరోలు మేకోవర్ అయితే సాధారణంగానే వారిద్దరిని అభిమానులు సరిపోల్చుతుంటారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ బాగుందా? మహేష్ న్యూ లుక్ అదిరిందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే, మొన్నటివరకు కాస్త బొద్దుగా కనిపించిన తారక్, జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తూ సిక్స్ ప్యాక్ తో కనిపించి షాక్ ఇచ్చాడు. ఫేస్ లో గ్లో తగ్గకుండానే సిక్స్ ప్యాక్ ను చూపించడంతో ఆ లుక్ వెంటనే ఆకర్షించింది. అయితే దాదాపుగా ఇదే లుక్ తారక్ ‘టెంపర్’లో కూడా చూపించారు.

ఇక మహేష్ విషయానికి వస్తే, గత నాలుగు సినిమాలుగా ఒకే లుక్ ను మైంటైన్ చేస్తూ కాస్త బోర్ కొట్టించిన ప్రిన్స్ ను ఒక్కసారిగా గడ్డం, సరికొత్త హెయిర్ స్టైల్ తో చూసిన ప్రేక్షకులకు పూర్తిగా కొత్తగా కనపడుతున్నాడు. అందులోనూ ఇప్పటివరకు గడ్డం లుక్ తో (టక్కరిదొంగ లో కాసేపు) కనిపించకపోవడంతో, ఆదివారం నాడు రెండు ఈవెంట్స్ లో పాల్గొన్న మహేష్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అలాగే సాధారణ ప్రేక్షకులు కూడా ప్రిన్స్ మేకోవర్ కు ఫిదా అయ్యారు.

కొత్త లుక్ తెచ్చుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ నిరంతరాయంగా దాదాపుగా నాలుగు నెలల నుండి చాలా కష్టపడగా, మహేష్ జస్ట్ హెయిర్ స్టైల్, గడ్డం, మీసంతో ఒక నెల రోజులలో అందరినీ ఫ్లాట్ చేసాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ అక్టోబర్ లోనే తన న్యూ లుక్ మూవీని తీసుకువస్తుండగా, మహేష్ బాబు 25వ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ, సమ్మర్ కు గానీ సిద్ధం కావచ్చు. కాకతాళీయమైన విషయం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ కూడా తన 25వ సినిమాలో గడ్డం లుక్ తో కనిపించడం!