Jr NTR - Koratala Sivaకొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య బాక్సాఫీసు వద్ద బోర్లా పడటంతో ఎన్నడూ లేని విదంగా అనేక చర్చలు మొదలయ్యాయి.

ముందుగా రాజమౌళి సినిమాలలో నటించిన హీరోలకు తరువాత చేసే సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ మళ్ళీ తెరపైకి వచ్చింది. రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్‌ తరువాత ఆచార్య చేశారు కనుకనే ఫ్లాప్ అయ్యిందనే వాదన వినిపిస్తోంది.

ఆ లెక్కన జూ.ఎన్టీఆర్‌ కూడా ఆర్ఆర్ఆర్‌లో నటించారు కనుక కొరటాల శివతో చేయబోతున్న సినిమాపై కూడా ఈ ప్రభావం పడుతుందేమో?అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే ఈ సెంటిమెంట్ అర్ధరహితమైనదని అందరికీ తెలుసు. హీరోలు సరైన కధను ఎంపిక చేసుకోకపోవడం, దర్శకుల నేపధ్యం, ప్రతిభపై గుడ్డిగా నమ్మకం ఉంచి సినిమా చేయడం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పక తప్పదు. కనుక జూ.ఎన్టీఆర్‌ కొరటాలను చూసి కాకుండా ఆయన చెప్పిన కధలో దమ్ముందో లేదో నిర్ధారించుకొని సినిమా చేస్తే ఈ రాజమౌళి సెంటిమెంట్ ఏమీ చేయలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

కొరటాల శివతో తమ అభిమాన హీరో జూ.ఎన్టీఆర్‌ సినిమా చేయబోతున్నాడని తెలిసి ఎగిరి గెంతేసిన అభిమానులు ఇప్పుడు శివతో సినిమా గురించి ఆందోళన చెందుతున్నారు.

ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే, కొరటాల శివ తన సినిమాల బిజినెస్ స్వయంగా చూసుకొంటారు. కనుక ఆచార్యతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు కొరటాల శివ తన తదుపరి సినిమాలో కాస్త డిస్కౌంట్ ఇవ్వక తప్పదు. అది ఇండస్ట్రీలో చాలా సహజం కూడా. కనుక ఆ మేరకు జూ.ఎన్టీఆర్‌ సినిమా ఆదాయం వదులుకోవలసి ఉంటుంది. అయితే కొరటాల శివ, జూ.ఎన్టీఆర్‌ మంచి స్నేహితులు కనుక ఈ సినిమా నిర్మాత ఈ సమస్యను చాలా సామరస్యంగా పరిష్కరించుకోవలసి ఉంటుంది.

ఒకవేళ ఆచార్య దెబ్బతో కంగుతిన్న కొరటాల శివ ఈసారి జూ.ఎన్టీఆర్‌ సినిమాకు మంచి బలమైన కధ అందిస్తే, సినిమా సూపర్ హిట్ అవుతుంది. అప్పుడు ఈ సెంటిమెంట్లు, ఆందోళనలు, సమస్యలు, లెక్కలు అన్నీ గాలికి కొట్టుకుపోతాయి. కనుక కొరటాల శివ, జూ.ఎన్టీఆర్‌ ఇద్దరూ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈసారి తప్పకుండా హిట్ కొడతారని ఆశిద్దాం.