భారీ అంచనాలతో విడుదలైన ‘జనతా గ్యారేజ్’ పాటలు మరియు ధియేటిరికల్ ట్రైలర్ యంగ్ టైగర్ అభిమానులను అలరిస్తున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా ‘బ్లాక్ బస్టర్’ అనే నమ్మకంతో హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ ఉన్నారు. అవే వ్యాఖ్యలను ఆడియో వేడుకపైన వ్యక్తపరిచి, అభిమానుల్లో ఉత్సాహాన్ని కూడా నింపారు. అయితే, వీరి వ్యాఖ్యలలో వాస్తవం ఎంత అనేది సెప్టెంబర్ 2వ తేదీన తేలనుంది.
ఏది ఏమైనా ‘జనతా గ్యారేజ్’ ఫలితం మాత్రం కొన్ని లెక్కలను సరిచేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనుకున్న విధంగా ‘బ్లాక్ బస్టర్’ ఫలితాన్ని అందుకుంటే మరోసారి ‘నెంబర్ గేమ్’లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ కావడం తధ్యం అన్న టాక్ సినీ విశ్లేషకులలో వ్యక్తం అవుతోంది. అయితే అన్నింటి కంటే ముఖ్యంగా టాప్ దర్శకుల జాబితాలో నెంబర్ గేమ్ ను మార్చే చిత్రంగా ‘జనతా గ్యారేజ్’ ఫలితం ఉండబోతుందని విశ్లేషిస్తున్నారు.
తెలుగులో నెంబర్ 1 దర్శకుడు ఎవరన్నది… అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు రాజమౌళి. ఇందులో మరో మాటకు తావు లేదు. అయితే ఆ తర్వాత పేర్లు ఎవరివి అన్నది మాత్రం ఖరారు కాలేదు. త్రివిక్రమ్, పూరీ, వినాయక్, సుకుమార్… ఇలా జాబితా చాలానే ఉంది. మాటల్లో త్రివిక్రమ్, హీరోయిజంలో పూరీ, క్రియేటివిటీలో సుకుమార్… ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్పెషాలిటీ. అయితే ‘జక్కన్న’ మాదిరి ఎవరూ వరుసగా సక్సెస్ లు ఇచ్చింది లేదు. దీంతో టాలీవుడ్ దర్శకుల జాబితాలో నెంబర్ 2 స్పాట్ ఖాళీగా ఉంది.
ఈ స్పాట్ ను అందుకునే అవకాశం కొరటాల శివకు ‘జనతా గ్యారేజ్’ రూపంలో రాబోతోంది. అంచనా వేసిన విధంగానే ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ అయితే, టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత క్రేజీ దర్శకుడిగా మారిపోతాడని చెప్పడంలో సందేహం లేదు. మరో విధంగా చెప్పాలంటే వరుస సక్సెస్ ల విషయంలో జక్కన్నకు పోటీగా నిలుస్తాడని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే… ఇప్పటివరకు కొరటాల కొట్టిన రెండు సక్సెస్ లు సాధారణమైనవి కావు.
‘మిర్చి’ ప్రభాస్ కెరీర్లోనే టాప్ స్థాయిని అందుకోగా, ‘శ్రీమంతుడు’ ఏకంగా ‘బాహుబలి’ తర్వాత స్థానాన్ని అందుకుని చరిత్ర సృష్టించాడు. ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ అయితే ఆల్ టైం రికార్డుల పరిస్థితి ఎలా ఉన్నా.., జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో టాప్ రేంజ్ ని అందుకోవడం ఖాయం. రాజమౌళి మినహా ఇలా వరుసగా కమర్షియల్ సక్సెస్ లు ఇచ్చిన దర్శకులు ఎవరూ లేరు. అదీ గాక, రాజమౌళికి కూడా సాధ్యం కాని రీతిలో… ఒక సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ హిట్లు అందిస్తుండడం కొరటాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చింది. దీంతో ‘జనతా గ్యారేజ్’ ఫలితం టాలీవుడ్ లో సరికొత్త లెక్కలను పరిచయం చేయనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.