jr-ntr-janatha-garage-all-time-3rd-biggest-hit-telugu-industry‘జనతా గ్యారేజ్’ రికార్డులపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగానే ప్రకటనలు గుప్పిస్తోంది. ఫస్ట్ వీక్ రికార్డులతో మొదలైన ‘జనతా గ్యారేజ్’ ప్రస్థానం, 15 రోజులు ముగిసే సమయానికి ఏకంగా ఆల్ టైం జాబితాలో టాప్ 3 స్థానంలో నిలిచిందని తాజాగా ఓ పోస్టర్ ద్వారా స్పష్టం చేసింది. అంటే ‘జనతా గ్యారేజ్’ పైన ఉన్నాయి రెండే రెండు సినిమాలు. ఒకటి ‘బాహుబలి’ కాగా, ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టడమనేది సాధ్యం కాని విషయంగానే పరిగణించవచ్చు.

ఇక, నెంబర్ 2 స్పాట్ లో ఉన్నది ప్రిన్స్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు.’ ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు, మూడు స్థానాలు ఆ సంస్థకే దక్కినా, హీరోలుగా ఎవరు ముందు వరుసలో ఉన్నారనేది అభిమానుల ఆసక్తిగా ఎదురుచూసే అంశం. ఇదే ఊపును మరో రెండు వారాల పాటు ‘జనతా గ్యారేజ్’ కొనసాగిస్తే… టాప్ 2 స్థానాన్ని కైవసం చేసుకోవడమనేది అసాధ్యం కాకపోవచ్చని ట్రేడ్ పండితుల అంచనా.

‘జనతా గ్యారేజ్’కు కలిసొచ్చే అంశం ఏమిటంటే… ఈ వారం అటు పెద్ద, ఇటు చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేసేవి లేకపోగా, వచ్చే వారం మాత్రం నాని ‘మజ్ను’ బరిలోకి దిగనుంది. దీంతో ఎలా లేదన్నా మరో వారం రోజుల పాటు ‘జనతా గ్యారేజ్’కు అవకాశం లభించినట్లే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, ‘శ్రీమంతుడు’ను దాటుకుని, రెండవ స్థానానికి చేరుకోగలుగుతుంది. అయితే తొలి రోజు సినీ విశ్లేషకుల అభిప్రాయాల రీత్యా, పబ్లిక్ టాక్ రీత్యా ‘జనతా గ్యారేజ్’ ఈ స్థాయికి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించలేకపోయాయి.