Jr NTR Jai Performance in Jai Lava Kusa!జై… లవ… కుశ… మూడు పాత్రలలో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” సినిమా ఎలా ఉంది? తారక్ ను ‘సర్ధార్’ దర్శకుడు బాబీ ఎలా హ్యాండిల్ చేసాడు? అన్న విషయాలు కాసేపు పక్కన పెడితే… ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించే జూనియర్ ఎన్టీఆర్ కు, మూడు పాత్రల ద్వారా విలక్షణతను చూపించడం పెద్ద కష్టమైన విషయం కాదు అని ఈ సినిమా నిరూపించింది. ఎందుకంటే… ఈ మూడు పాత్రలలో ఉన్న డిఫరెన్స్ ను “జై లవకుశ” సినిమాలోని ఫస్టాఫ్ లో అద్భుతంగా పండించారు తారక్.

“జై” పాత్ర ద్వారా పవర్ ఫుల్ రాక్షసత్వం… ‘లవ’ ద్వారా అమాయకత్వం… ‘కుశ’ ద్వారా అల్లరితనం… మొత్తమ్మీద ఈ మూడింటిలో ఉన్న వేరియేషన్స్ ను సినిమాలోని మొదటి భాగంలో అభిమానులకు కన్నులవిందు అయ్యేలా చూపించడంలో ఎన్టీఆర్ వందకు వంద శాతం విజయవంతం అయ్యాడు. ఈ మూడింటిలో కుశ పాత్ర రెగ్యులర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కాగా, ‘లవ’ పాత్రతో కాస్త విలక్షణతను, ‘జై’ పాత్రతో పూర్తి కొత్తదనాన్ని చూపించి, ‘శభాష్’ అనిపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ఫస్టాఫ్ లో ఇలా ముగ్గురిలా కనపడి అలరించిన జూనియర్ ఎన్టీఆర్, సెకండాఫ్ కు వచ్చేసరికి ముగ్గురు ఒక్కటే అయిపోవడం పెద్ద ‘ట్విస్ట్.’ అవును… జై… లవ… కుశ… ఇలా ముగ్గురు కూడా ‘జై’ లాగానే నటించడంతో, సెకండాఫ్ లో వేరియేషన్స్ కు అవకాశం లేకుండా, అంతా “జై” మీదనే నడుస్తుంటుంది. అయితే మిగతా రెండు క్యారెక్టర్స్ కూడా ‘జై’ మాదిరి ఎందుకు నటించారన్నది “కోన” గారి సినిమాటిక్ వ్యవహారమే. దీంతో మూడు రోల్స్ లో చూడాలనుకున్న ప్రేక్షకులకు సెకండాఫ్ లో ఎక్కువ శాతం ‘జై’ ఒక్కడే కనపడతాడు.

ఎన్టీఆర్ నటన గురించి విమర్శించడానికి ఎక్కడా అవకాశం లభించదు గానీ, ఆ అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం, తాపత్రయ పడడం అనేది సినిమాటిక్ వ్యవహారంలో నడుస్తుంటుంది కాబట్టి, ప్రేక్షకులు దీనిని ఎంతవరకు తీసుకుంటారు అనే దాని పైన ఈ సినిమా సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంటుంది. వేకువజామున పడిన ప్రీమియర్స్ ప్రకారం అయితే… ఈ విషయంలోనే భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఫైనల్ టాక్ రావాలంటే సాయంత్రం షోల వరకు వేచిచూడాల్సిందే.