Jr NTR jai-lava-kusa Vs Mahesh babu Spyderఈ దసరాకు రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. రెండింటిలో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” సినిమా ప్రేక్షకులను ఈ వారమే పలకరించనున్న నేపధ్యంలో… ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కు ‘స్పైడర్’కు సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. ఈ పండగకు రిలీజ్ కాబోతున్న “స్పైడర్” గురించి అడుగుతూ… ఇలాంటి సందర్భాలలో హీరోల మధ్య పోటీ ఉంటుందా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, తారక్ తనదైన శైలిలో జవాబిచ్చారు.

అంతకుముందు కూడా తాను చెప్పాను… ఓ స్ఫూర్తిదాయకమైన పోటీ ఉండడం మంచి పరిణామమే. దానిని నేను “వార్” అని భావించను, కేవలం ‘పోటీతత్వం’గా పరిగణిస్తాను, అది ఉండడం మంచిదే, నా కంటే బాగా అభినయించాడు, నేను కూడా అంతకంటే బాగా చేయాలి అన్న తపన ఉన్నపుడు చాలా బాగుంటుందని చెప్పిన జూనియర్, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలను ప్రస్తావించారు. ‘ఖైదీ నంబర్ 150’ చిరంజీవి కెరీర్ లో, బాబాయ్ ది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆయన కెరీర్ లో, అలాగే ‘శతమానం భవతి’ శర్వానంద్ కెరీర్ లలో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయని చెప్పుకొచ్చారు.

ఇదే కాదు, అంతకుముందు కూడా అయిదారు సినిమాలు విడుదలైన దాఖలాలు ఉన్నాయని, వంద సినిమాలు విడుదలైనా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండ చూస్తారని, అంతిమంగా అది సినీ ఇండస్ట్రీకే మంచి జరుగుతుందని అన్నారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ వ్యాఖ్యానించడంలో తారక్ మరోసారి తన సహజశైలిని ప్రదర్శించారు. అయినా తారక్ అన్నట్లు… ‘వార్’ కాకుండా ‘పోటీ’ వాతావరణం ఉండడంలో తప్పులేదు గానీ… నిజంగా పరిస్థితి అలాగే ఉంటోందా? అన్నది మాత్రం అటు హీరోలందరూ మరియు ఇటు అభిమానులందరూ మననం చేసుకోవాల్సిన అంశం.