jr-ntr-jai-lava-kusa-review- criticsఇటీవల కాలంలో సినీ రివ్యూలపై అగ్ర హీరోలు కూడా పెదవి విప్పుతున్నారు. సమ్మర్ లో విడుదలైన ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా సందర్భంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినీ విశ్లేషకులపై ఓ రేంజ్ లో ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజులు కూడా అంతే స్థాయిలో ‘రివ్యూ’లపై ఫైర్ అయ్యారు. ఈ సినిమా తర్వాత పెద్ద సినిమాగా విడుదలైన ‘జై లవకుశ’ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా సినీ విశ్లేషకులపై సున్నితమైన విమర్శలు చేసారు.

‘ఎమెర్జెన్సీ ఉన్న పేషెంట్ – డాక్టర్ – దారిన పోయే దానయ్య’ అంటూ సుదీర్ఘంగా ఉదహరించిన జూనియర్ ఎన్టీఆర్, తమ సినిమా ఎమెర్జెన్సీలో ఉన్న పేషెంట్ లాంటిదని, డాక్టర్లుగా భావించే ప్రేక్షకులు చెప్పే ముందు, ఎవరో దారిన పోయే దానయ్య మాదిరి కొంతమంది సినీ విశ్లేషకులు సినిమాలను చంపేయాలని ప్రయత్నిస్తున్నారని, ఇది మా ఒక్క సినిమాకు మాత్రమే జరగలేదని, అన్ని సినిమాలకు జరుగుతోందని, డాక్టర్లు భావించే తమ ప్రేక్షకులు చెప్పే వరకు ఆగండి… అంటూ సునిశితంగా వ్యాఖ్యానించారు.

ఒకవేళ డాక్టర్లు ‘వీడు బతకడు, చచ్చిపోతాడు’ అంటే దానిని అంగీకరించడానికి మేం సిద్ధం, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా తీస్తాం, అంతేగానీ ‘ఇక అయిపొయింది, పోయాడు, చచ్చిపోయింది’ అంటూ మీరు డిక్లేర్ చేయవద్దని తారక్ కాస్త ఏమోషనల్ గా వ్యాఖ్యానించాడు. మన ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారికి చెప్పడానికి హక్కుంది, దానిని కాదనను అంటూ… నా ఆవేదన చెప్పడానికి ప్రయత్నించానే తప్ప, ఎవరిని హర్ట్ చేయాలని కాదంటూ… మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.