Jr NTR First Time On Telelvisionప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ కు ఎంత క్రేజ్ ఉందో, స్మాల్ స్క్రీన్ కు కూడా అంతే స్థాయిలో క్రేజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే, వెండితెర కంటే ఒక మెట్టు పైనే బుల్లితెర ఉందని చెప్పాలి. అలాంటి బుల్లితెరపై కనిపించేందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంతో ఉత్సాహపడ్డ విషయం తెలిసిందే. తెలుగులో కింగ్ నాగార్జున సెట్ చేసిన ఈ ‘ట్రెండ్’ను మెగాస్టార్ కొనసాగించగా, త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారని లభించిన సమాచారం.

అవును… త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు బుల్లితెరపై కనిపించబోతున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న ‘బిగ్ బాస్’ షోను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు గానీ, బుడ్డోడు ఫస్ట్ టైం బుల్లితెరపై కనిపించబోతున్నారనేది మాత్రం స్పష్టం. ఇప్పటివరకు ఉత్తరాదిని ఊపిన ‘బిగ్ బాస్’ షో, తాజాగా కమల్ హాసన్ తో తమిళంలో… జూనియర్ ఎన్టీఆర్ తో తెలుగులో అడుగు పెట్టబోతోంది.

అయితే ఇప్పటికే తెలుగునాట అడల్ట్ కార్యక్రమాలు ఎక్కువైపోయాయని ఆందోళనలు చెలరేగుతున్న నేపధ్యంలో… బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న ‘బిగ్ బాస్’ షోను తెలుగులోకి ఎలా తర్జమా చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. అలాగే ఇలాంటి షోను జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా నిర్వహిస్తారు అనేది కూడా అభిమానులలో నెలకొన్న సందేహం. అయితే అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సినీ ప్రముఖుల సమాచారం మేరకు, ఇప్పటికే దీనికి సంబంధించిన వ్రాతపూర్వక అగ్రిమెంట్స్ పూర్తయ్యాయని సమాచారం.