Jr NTR Fires On Reviewsటాలీవుడ్ అగ్ర హీరోలు తామే దేవుళ్ళమనే ఒక ‘ఫోబియా’లో ఉన్నారా? అభిమానులు తమ హీరోలను గుండెల్లో కాకుండా, నెత్తిన పెట్టుకుంటున్న తీరుతో… ఆడియో వేడుకలపై, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హీరోలను ఆకాశానికేత్తేస్తూ భజనపరుల కీర్తనలతో… తామే ‘రూలర్స్’ అనుకుంటున్నారా? ఏమో తెలుగు చిత్రసీమలో వర్తమాన పరిస్థితులు గమనిస్తుంటే అలాగే అనిపిస్తోంది. ‘భజన’ను నవ్వుతూ స్వీకరించే అగ్ర హీరోలు, విమర్శలను ఏ మాత్రం అంగీకరించడానికి సిద్ధంగా లేరన్న సంకేతాలను స్వయంగా హీరోల వ్యాఖ్యల ద్వారానే బయటపడుతున్నాయి.

ఒక సినిమా చేయడానికి హీరోలు ఎంతగా కష్టపడతారో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సబ్జెక్ట్ ను బట్టి శారీరకంగా, మానసికంగా, చాలా కష్టనష్టాలు పడి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అలా అని ఆ కష్టాన్నంతా ప్రేక్షకుల నెత్తిన వేసి, ‘ఖచ్చితంగా చూడాల్సిందే’ అనడం సమంజసమైన విషయమేనా? కానీ పరోక్షంగా కొందరు అగ్ర హీరోలు అలాంటి వ్యాఖ్యలనే చేస్తుండడం ఊహించని పరిణామం. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలతో ‘సినిమా రివ్యూ’ల సబ్జెక్ట్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా విడుదలైన ప్రతి సినిమాను విశ్లేషణ చేసి, ‘రివ్యూ’ రూపంలో ప్రేక్షకులకు తెలియజేయడం సినీ విశ్లేషకులు చేస్తోన్న పని. ఇది ఇవాళ కొత్తగా ప్రారంభమైనది కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతోన్న విషయమే. ఒకప్పుడు ఈ విశ్లేషణలపై దర్శకుడు పూరీ జగన్నాధ్ విరుచుకుపడి, తన సినిమాలలో కాస్త ఎటకారంగా డైలాగ్ లను కూడా సంధించారు. అయితే వాటిని కూడా విశ్లేషణ చేసి, అవి ధియేటర్లో పండాయో లేదో అని చెప్పడం విశ్లేషకుల వంతయ్యింది. అలా ప్రారంభమైన ‘రివ్యూ’లపై ‘రగడ,’ ప్రస్తుతం అగ్ర హీరోలు పెదవి విప్పే వరకు చేరుకుంది.

అయితే… ఎప్పుడు పొగడ్తలు మాత్రమే వినే అగ్ర హీరోల చెవులకు, రివ్యూల రూపంలో వచ్చే విమర్శలను స్వీకరించే మానసిక స్థితిలో లేరని ఈ సందర్భంగా స్పష్టమవుతోంది. మొన్న అల్లు అర్జున్ కావచ్చు… నేడు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు… రేపు మరో హీరో కావచ్చు… ఇలా వరుసగా సినీ విశ్లేషకులను టార్గెట్ చేయడం వెనుక ఒక ఉద్దేశం ఉందా? రివ్యూలను నియత్రించాలని టాలీవుడ్ వర్గాలు కంకణం కట్టుకున్నారా? ఏమో నాడు అల్లు అర్జున్ చేసిన సమయంలోనూ, నేడు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించే సమయంలోనూ… బ్యాక్ గ్రౌండ్ లో దిల్ రాజు మాత్రం దర్శనమిచ్చారు. ‘దువ్వాడ’ విషయంలో దిల్ రాజు కూడా ఇలా నోటికి పని చెప్పిన విషయం తెలిసిందే.

కాసేపు వీళ్ళ మాటలను, సినీ విశ్లేషకులను పక్కన పెడితే… నిజంగా రివ్యూల ప్రభావం ప్రేక్షకులపై పడుతోందా? రివ్యూలను చూసి సినిమాలకు వెళ్ళకుండా మానేస్తున్నారా? అంటే… ఇలా విమర్శలు చేస్తున్న హీరోల అవగాహనా లోపమే అని చెప్పుకోవాలి తప్ప… ప్రేక్షకులలో ఎలాంటి తప్పు లేదన్న భావన కలుగుతోంది. ‘జై లవకుశ’ విషయానికే వస్తే… ఈ సినిమాకు 2.5-3.25 మధ్య రేటింగ్స్ వచ్చాయి. అంటే వారి లెక్క ప్రకారం, 2.5 అందించిన రేటింగ్ ను చూసి ప్రేక్షకులు సినిమా చూడడం మానేయాలి కదా! అదే జరిగితే ‘జై లవకుశ’ చిత్ర యూనిట్ చెప్పుకుంటున్న 4 రోజుల్లో 75 కోట్ల కలెక్షన్స్ తప్పు కావాలి కదా!?

అలా జరగలేదు అంటే… ప్రేక్షకులు సినిమా రివ్యూలను చదువుతున్నా, సినిమాలను చూడడం మాత్రం ఆపలేదని అర్ధమవుతోంది కదా! సరే ‘రివ్యూ’లు తప్పనే అనుకుంటే… 4 రోజుల్లోనే 75 కోట్లు కొల్లగొట్టిన ‘జై లవకుశ’ సినిమాపై ప్రేక్షకుల ‘మౌత్ టాక్’ అదిరిపోవాలి కదా! అలా జరిగిందా… అంటే… నాలుక కరుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. హార్డ్ కోర్ అభిమానులను మినహాయిస్తే… సాధారణ అభిమానుల నుండి సగటు సినీ ప్రేక్షకుల టాక్ ను పరిశీలిస్తే… అది ‘యావరేజ్’ అన్న బోర్డర్ ను దాటలేకపోయింది. అయినప్పటికీ కోట్ల రూపాయల కలెక్షన్స్ ను ప్రేక్షకులు తిరిగి ఇచ్చారు, ఇస్తున్నారు కూడా! అయినా ఈ ‘రివ్యూ’లపై దాడులు ఎందుకో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

ఎన్ని చెప్పినా… ఫైనల్ పాయింట్ మాత్రం ఇక్కడే తేలుతోంది… భజనపరుల స్వరాలను మాత్రమే ఆలకించే అగ్ర హీరోలు, విమర్శలను ఏ మాత్రం తట్టుకోలేక పోతున్నారని పదే పదే నిరూపణ అవుతూ వస్తోంది. ఈ వరుసలో ఇంకెంతమంది అగ్ర కధానాయకులు బయటపడతారో చూడాలి.