Jr Ntr Fans vs Ram Charan Fansఈ నెల 25వ తేదీన “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. మాస్ ఇమేజ్ ఉన్న ఇద్దరు బడా స్టార్లను హ్యాండిల్ చేసి, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా షూటింగ్ ముగించుకుని, విడుదలకు సిద్ధమైన రాజమౌళికి ఇప్పుడు టెన్షన్ మొదలయ్యిందా? అంటే అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

‘కత్తి మీద సాము’ లాంటి అసలు పనిని సులువుగా ముగించిన జక్కన్నకు, ఇప్పుడు ఇద్దరి హీరోల అభిమానులను హ్యాండిల్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతోంది. రిలీజ్ కు దగ్గర పడుతోన్న కొద్దీ సోషల్ మీడియాలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్, తమ అభిమానాన్ని ప్రదర్శించేందుకు శక్తి వంచన లేకుండా పోటీలు పడుతున్నారు.

Also Read – వైసీపి భూకబ్జాలపై మెతక వైఖరి పాటిస్తే….

యుఎస్ లో ‘తొక్కుకుంటూపోవాలే’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గాలిలో చేసిన విన్యాసాలతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ఏదైనా తమ హీరో బరిలోకి దిగనంతవరకే అన్నట్లుగా ‘వేటగాడు వచ్చేటంతవరకే’ అన్న డైలాగ్ తో యాష్ ట్యాగ్ ను వినియోగించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ కు శ్రీకారం చుట్టారు.

ఈ అభిమాన ప్రదర్శన ఎవరి హీరోల గురించి వారు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ తమ హీరోనే గొప్ప అనే విధంగా చాటుకుంటుంటేనే అసలు సమస్య తలెత్తుతోంది. సోషల్ మీడియాను విస్తృతంగా విశ్లేషణ చేసే రాజమౌళి దృష్టికి ఈ విషయం వెళ్లకుండా ఉండదు. బహుశా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గానీ, ప్రమోషన్ ఇంటర్వ్యూలలో గానీ ఈ ఫ్యాన్స్ వార్ కు బ్రేకులు పడే విధంగా ప్రసగింస్తారేమో చూడాలి.

Also Read – టైం చూసి కొడుతున్నారా బ్రో..!

ఈ సందర్భంగా పదేళ్ల క్రితం ‘ఓపెన్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో రాజామౌళి చెప్పిన ఓ విషయం కూడా హల్చల్ చేస్తోంది. 95 శాతం అగ్ర హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఫ్యాన్స్ అందుకు సుముఖంగా ఉండరని, వారిని హ్యాండిల్ చేయడం ఆ హీరోలకు కూడా తలకు మించిన భారమని చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

అంటే అప్పటికి, ఇప్పటికీ ఫ్యాన్స్ అదే తీరున ఉన్నారని చెప్పడానికి ఈ వీడియోను వెలుగులోకి తీసుకువచ్చారు. రిలీజ్ ఇంకా పది రోజుల సమయం ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే, రిలీజ్ కు దగ్గర పడేకొద్దీ ఈ ఫ్యాన్స్ వార్ ఏ మలుపులు తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఇలాంటి పోకడకు తిలోదకాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత అందరి హీరోల అభిమానులకు ఉంది.

Also Read – బూతులు తిట్టింది ఇద్దరే! నమ్మేద్దామా.?

గతంలో ఓ ఈవెంట్ లో మహేష్ బాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా! ‘మేము – మేము బాగా ఉంటాం, మీరు – మీరే ఇంకా బాగా ఉండాలి’ అని చెప్పిన వైనం ఈ సందర్భంగా అందరి హీరోల ఫ్యాన్స్ గుర్తుంచుకోవాలి. అప్పుడే “ఆర్ఆర్ఆర్” లాంటి భారీ మల్టీస్టారర్ సినిమాలు తెలుగునాట కూడా మరిన్ని రూపుదిద్దుకుంటాయి, సినీ ప్రేక్షకులను అలరిస్తాయి.