ntr nannaku premathoగత నాలుగైదు సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల “నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా” సంబంధించిన రిలీజ్ తేదీలు బయటకు వచ్చేసాయి. ఇక సమరం మొదలు కావాల్సిందే అంటున్నారు సినీ అభిమానులు కూడా! అయితే ఏ సినిమా విజయవంతం అవుతుందనే అంచనాలు పక్కన పెడితే అసలు ఎవరికి విజయం అవసరమనేది కీలకంగా మారింది.

బరిలో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, శర్వానంద్, నాగార్జున ఉండగా.., ఈ నలుగురిలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కే ఖచ్చితమైన విజయం అవసరం. మరో మాటగా చెప్పాలంటే… హిట్ ను మించిన రేంజ్ ‘బ్లాక్ బస్టర్’ టాక్ జూనియర్ కు అత్యవసరం. రాజమౌళి “సింహాద్రి” తర్వాత ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ‘బ్లాక్ బస్టర్’ చోటు దక్కలేదు. అందులోనూ ఇటీవల కాలంలో ‘నందమూరి’ అభిమానులతో మరియు బాలయ్య వర్గంతో పెట్టుకున్న విభేదాలతో ఇటు అభిమానుల్లోనూ, అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్ టాపిక్ గా మారడంతో “నాన్నకు ప్రేమతో” ఫలితం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు కీలకంగా మారింది. అలాగే 25వ చిత్రంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది “నాన్నకు ప్రేమతో.”

ఇక, మిగిలిన ముగ్గురు హీరోలు సక్సెస్ బాట నుండి వచ్చినవారే. ‘లెజెండ్’ సూపర్ సక్సెస్ తర్వాత బాలయ్య చేసిన ‘లయన్’ ఫలితం బాలయ్యపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ‘డిక్టేటర్’ రిజల్ట్ కన్నా కూడా బాలయ్య నటించబోయే 100వ చిత్రంపైనే ఫోకస్ ఎక్కువగా ఉంటోంది. శర్వానంద్ విషయానికి వస్తే, “రన్ రాజా రన్” విజయంతో మంచి ఊపు “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” సినిమా ఇచ్చిన మంచి ఫీల్ తో “ఎక్స్ ప్రెస్ రాజా”కు సిద్ధమయ్యాడు. నటుడిగా శర్వానంద్ కు ఎప్పుడూ మంచి మార్కులే పడుతుండడంతో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ కాస్త అటు ఇటు అయినా శర్వాకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు. “మనం”తో ఆల్ టైం హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ‘కింగ్’ నాగార్జునకు “సోగ్గాడే చిన్నినాయనా” ఖచ్చితంగా విజయం సాధించాల్సిన అవసరం లేదు.

తెలుగు సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకుంటే ప్రతి సినిమా విజయం సాధించాల్సిందే! అప్పుడే పరిశ్రమ ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా విరాజిల్లుతుంది. అయితే వ్యక్తిగత కెరీర్ పరంగా అయితే రాబోయే సంక్రాంతి రేస్ లో “నాన్నకు ప్రేమతో” సినిమాకు ముక్త కంఠంతో జననీరాజనం పలకాల్సిందే! మరి జూనియర్ కు ఆ అవకాశాన్ని ఈ సంక్రాంతి నేరవేరుస్తుందా? లేదంటే ఎప్పటిమాదిరి విడుదలకు ముందు భారీ హైప్, విడుదల తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడం జరుగుతుందా? అన్నది మిక్కిలి ఆసక్తికరంగా మారింది.