JR NTR Entry in Politics is just a rumourరాజకీయాలకు సినిమాలకు రంగాల పరంగా ఎలాంటి సంబంధం లేకపోయినా రెండింటి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు దేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాక ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ల పొలిటికల్ ఎంట్రీలు ఎక్కువయ్యాయి. సహజంగానే ఆ కుటుంబంలో ఉన్న ప్రతిఒక్కరికి దాంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉంటూ వస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రతిసారి పోటీ చేస్తూ గెలుస్తూ తండ్రికి సెంటిమెంట్ గా నిలిచే కంచుకోటను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈయన తప్ప టిడిపి కోసం నేరుగా ఈ వ్యవహారాల్లో తలదూర్చిన వాళ్ళు లేరు.

ఇక అసలు విషయానికి వస్తే ఇటీవలే తారకరత్న గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్ళినప్పుడు తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్టు ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమన్నట్టు ప్రకటించారు. సహజంగానే అక్కడికి వెళ్లిన మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఎప్పటి నుంచో టిడిపికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు తమ్ముడు ప్రచారానికి వస్తాడని ఏదో అప్పటికప్పుడు ఆ సందర్భాన్ని మేనేజ్ చేయాలన్న ఉద్దేశంలో సమాధానం చెప్పాడు. దీంతో ఒక వర్గం ఏకంగా తారక్ కమింగ్ సూన్ అని హెడ్డింగ్ పెట్టేసి వార్తలు వండేశారు.

కానీ ప్రాక్టికల్ సెన్స్ లో చూస్తే జూనియర్ ఇప్పుడప్పుడే పొలిటికల్ జానర్ లో వచ్చే పరిస్థితిలో లేడు. కెరీర్ దివ్యంగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ వల్ల అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అందుకే ఫ్యాన్స్ ఎంత ఒత్తిడి చేస్తున్నా తలొగ్గకుండా కొరటాల సినిమాకు విపరీతమైన జాప్యం జరుగుతున్నా సరే కంటెంట్ కోసం కట్టుబడుతున్నాడు. తర్వాత కెజిఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన ధ్యాస సినిమాల మీద తప్ప ఇంక దేని మీద లేదు. కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే ఎవరికైనా ఈ విషయం సులువుగా తడుతుంది.

ఇక తారకరత్న మాటలకు అవసరానికి మించిన ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇలాంటి పుకార్లు వస్తున్నాయన్న కామెంట్లలో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఇతనికి సాధారణ పబ్లిక్ లో కానీ నటుడిగా ఇమేజ్ కానీ ఏమీ లేదు. తొమ్మిది సినిమాలతో డెబ్యూ చేయడం తప్ప హీరోగా సాధించిన విజయాలు కూడా అంతంతమాత్రమే. పైగా తనకు జూనియర్ తో మంచి సంబంధాలు ఉన్న దాఖలాలు లేవు. టిడిపి శ్రేణుల్లోనే తారకరత్న ఎంట్రీ పట్ల ఎలాంటి ఎగ్జైట్ మెంట్ లేదు. అలాంటప్పుడు ఏదో ఫ్లోలో అనేసిన మాటలకు అన్నేసి అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్న జూనియర్ మీద ఈ ప్రచారాలు చూపించే ప్రభావం సున్నానే.