NTR Is Turning the Best TV hostత‌న యూ ట్యూబ్ ఖాతాలో ‘ప‌రుచూరి ప‌లుకులు’ పేరిట ప్ర‌తి మంగ‌ళ‌వారం త‌న అభిప్రాయాలు, అనుభ‌వాల‌ను పంచుకుంటున్న గోపాల‌కృష్ణ తాజాగా మాట్లాడుతూ… జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌ గా చేస్తోన్న ‘బిగ్ బాస్’ షోపై ప్రశంసలు కురిపించారు. జూనియ‌ర్‌ ఎన్టీఆర్ 12 ఏళ్ల బాలుడిగా ఉన్న‌ప్పుడు ఓ సారి త‌న కంట నీళ్లు తిరిగేలా చేశాడ‌ని, ‘బిగ్ బాస్’ షో లో ఆ కవ్వింపులు, లాలింపులు చూస్తుంటే నాడు చూసిన మా చిన్న రామయ్యేనా ఈ ఎన్టీఆర్‌? అనిపించిందని వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్‌ పిల్ల‌ల్లో త‌న‌కు మొట్ట‌మొద‌ట నంద‌మూరి హ‌రికృష్ణ ప‌రిచయం అయ్యారని, హ‌రికృష్ణ త‌న‌ను ప‌.గో అని పిలుస్తారని అన్నారు. అలా ఆయ‌న కుమారుడు ఎన్టీఆర్‌ తో కూడా త‌న‌కు ఓ అనుభవం ఉందని, “బాల‌రామాయ‌ణం” సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో రైల్లో వెళుతున్నామ‌ని, అప్పుడు ఎన్టీఆర్ కి 12 ఏళ్లు ఉండొచ్చని, ఆ పిల్లాడు అచ్చం పెద్ద ఎన్టీఆర్ లాగే ఉన్నాడని తాను మొద‌ట చూసిన‌ప్పుడు అనుకున్నాన‌ని, రైల్లో క్యాట‌రింగ్ సౌక‌ర్యం ఒక్క‌సారిగా ఆగిపోయిందని, ఏం చేయాలో తెలియ‌ని ఎన్టీఆర్ చేసిన పని తన కళ్ళు చెమర్చేలా చేసిందని అన్నారు.

ఆక‌లితో మాడిపోతోంటే ఆ చిన్నారి ఎన్టీఆర్ ఒక బాక్స్ తీసుకొచ్చి త‌న‌కు ఇచ్చి అది తిన‌మ‌న్నాడని చెప్పారు. మ‌రి నీకు? అని తాను అడిగానని, దానికి ఎన్టీఆర్ అమ్మ త‌న‌కు మ‌రో బాక్సు ఇచ్చింద‌ని అన్నాడ‌ని చెప్పారు. ఎన్టీఆర్ ఆ బాక్స్ త‌న‌ చేతికి ఇవ్వ‌గానే త‌న‌ క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయని, భావోద్వేగానికి గురయ్యానని, పన్నెండేళ్ల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ లో అన్నగారు కనిపించారని అన్నారు. తెలుగు ‘బిగ్‌ బాస్‌’ షో త‌న‌కు బాగా న‌చ్చింద‌ని, అప్ప‌ట్లో ఉమ్మ‌డి కుటుంబాలు ఉండేవని, ఇప్పుడు ఏ కుటుంబంలోకి వెళ్లినా భార్యాభ‌ర్త‌లు, ఒక‌రిద్ద‌రు పిల్ల‌లు మాత్ర‌మే క‌న‌ప‌డుతున్నార‌ని చెప్పారు.

ఏ మాత్రం ర‌క్త సంబంధం లేని వారిని బిగ్ బాస్ హౌస్ కి తీసుకొచ్చి, 70 రోజుల పాటు వారికి తెలియ‌ని ప్రేమాభిమానాలను వారిలో పుట్టిస్తున్నారని అన్నారు. బిగ్‌ బాస్ వ్యాఖ్యాత‌గా ఉన్న‌ చిన్న రామ‌య్య‌ను చూడ‌డానికి తాను ఎంతో ఉత్సాహం చూపిస్తున్నానని, ఒక రియాల‌టీ షో న‌డ‌ప‌డానికి ఎంతో స‌మ‌య‌స్ఫూర్తి, వాక్చాతుర్యం ఉండాలని, ఎన్టీఆర్ ఎంతో చ‌క్క‌గా నిర్వహిస్తున్నాడని కితాబిచ్చారు. ఈ షో మ‌నుషుల మ‌ధ్య‌ అనుబంధాల్ని, ఆత్మీయ‌త‌లను పెంపొందిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే ఉన్నట్లుండి ఎన్టీఆర్ ను ఇంత బాగా ఎందుకు లేపారు? అన్నది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.