NTR best actor for Film Fare Awardకన్నులపండుగగా హైదరాబాద్ లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో 2016 సంవత్సరానికి గానూ “ఉత్తమ నటుడు”గా జూనియర్ ఎన్టీఆర్ ఎంపికయ్యాడు. ఈ విభాగం నుండి తారక్ కు అల్లు అర్జున్ నుండి గట్టిపోటీ ఎదురు కావడంతో… చివరికి ఏ హీరో ఈ అవార్డు దక్కించుకుంటాడోనని ఇరువురు హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. వీరిద్దరితో పాటు నాని, నాగార్జున, నాగచైతన్య, రామ్ చరణ్ లు కూడా బరిలో ఉన్నప్పటికీ, బన్నీకి – తారక్ కు మధ్యే అసలు పోటీ నెలకొంది.

అయితే “సరైనోడు” సినిమాలో అల్లు అర్జున్ ప్రదర్శించిన అభినయం విమర్శకుల అవార్డుల కంటే, కమర్షియల్ యాంగిల్ లోనే ఉండడంతో, జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమాకు పోటీ లేకుండా పోయింది. ఉత్తమ నటుడు అవార్డు విభాగంలో తారక్ పేరు ప్రకటించగానే ఆడిటోరియం అంతా జూనియర్ నామస్మరణతో మారుమ్రోగడంతో, తారక్ కున్న రేంజ్ ఏమిటో మరోసారి తెలిసి వచ్చింది. ‘బుడ్డోడు’కు అవార్డు ప్రకటించే సమయంలో తారక్ పక్కనే బన్నీ కూర్చుని ఉండడం విశేషం.

అయితే తారక్ కు అవార్డు ప్రకటన ఇపుడు వచ్చిందేమో గానీ, గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చూసినపుడే ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు… 2016 సంవత్సరానికి ఉత్తమ నటుడు ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆరేనని! ఇక అవార్డు అందుకునే సమయంలో… ‘మీరు డైరెక్షన్ చేయబోతున్నారని విన్నాం’ అన్న ప్రశ్నకు ‘లేదండి… గుర్రం పని గుర్రం చేయాలి… గాడిద పని గాడిద చేయాలి…’ అంటూ దర్శకత్వం పట్ల తన ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పాడు. అయితే ఈ డైలాగ్ వేరే హీరోలకు బాగా కనెక్ట్ అయ్యిందనుకోండి..!