Jr NTR -away from TDP campaignమహాకూటమి తరపున టీడీపీ కూకట్ పల్లి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరి నందమూరి సుహాసినికి అనుకూలంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని మీడియాలోని వర్గంలో పెద్ద ఎత్తున ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు అయితే ఏకంగా ప్రచార షెడ్యూల్ ను కూడా ప్రచురించాయి. అయితే అవి అవాస్తవ వార్తలని తాజాగా వస్తున్న కదనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం జూనియర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

తన సోదరికి ప్రచారం చెయ్యాలని ఆయన మీద గట్టిగా ఒత్తిడి ఉన్నా వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. దీనితో ఇప్పటికే సోదరిని గెలిపించాలని ప్రకటన చేసి సరిపెట్టుకున్నారు. అయితే ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలివైనదా? కాదా అనేదాని పై కూడా భిన్న వాదనలు ఉన్నాయి. పార్టీ కష్ట కాలంలో ఉండగా పాత గొడవలన్నీ పక్కన పెట్టి ప్రచారం చేసి ఉంటే ఆయన చేసిన మేలు క్యాడర్ గుర్తు పెట్టుకునేదని తద్వారా ఒక మంచి అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నాడు అని కొందరు అంటున్నారు.

గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో అన్ని తానే అయ్యి వ్యవహరించిన లోకేష్ కేవలం పార్టీకి ఒక్క సీటు మాత్రం తీసుకుని రాగలిగారు. అదే చోట ఎన్టీఆర్ పార్టీకి మంచి విజయం చేకూరిస్తే తానేంటో నిరూపించుకున్నట్టు అయ్యేది. అయితే కొందరు మాత్రం వేరేగా అంటున్నారు. ఇప్పుడు పార్టీని గెలిపించినా ఇప్పట్లో రాజకీయాలలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ గెలుపు వేరొకరికి గానీ తనకు ఉపయోగపడదని వారి వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ నిర్ణయంతో నందమూరి కుటుంబంలో మళ్ళీ గ్యాప్ వచ్చే ప్రమాదమైతే ఉంది.

హరికృష్ణ అకాల మరణం తరువాత ఆయన కూతురు ప్రజా జీవితంలోకి వస్తుంటే సొంత కుటుంబసభ్యులే తోడుగా లేకపోవడం కారణమేదైనా అది మంచిగా అనిపించదు. దీనితో బాలయ్య అంతా తానై సుహాసిని కోసం ప్రచారం చేస్తున్నారు. తెలంగాణాలో తెలుగుదేశం మనుగడకు కూకట్ పల్లి గెలుపు చాలా కీలకం. అన్ని రకాలుగానూ పార్టీకి అనుకూలమైన ఈ నియోజకవర్గంలో సాక్షాత్తు నందమూరి కుటుంబసభ్యులనే నిలబెట్టినా గెలవకపోతే పార్టీ మనుగడ కష్టమే అని తేలిపోతుంది. 7వ తారీఖున తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి. 11న ఫలితాలు విడుదల అవుతాయి.