Targets-For-Jr.-NTR-Aravindha-Samethaఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే… అందులో పేలాలు ఎగలేదని మరొకరు రోధించారట..! ప్రస్తుతం అలా ఉంది “అరవింద సమేత వీర రాఘవ” పరిస్థితి. ఫస్ట్ టీజర్ కూడా విడుదలకు నోచుకోకముందే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు లీక్ కావడం చిత్ర యూనిట్ లో కలకలాన్ని రేపింది. ఈ సీన్స్ ఎలా లీక్ అయ్యాయి? ఎవరు లీక్ చేసారు? అన్న దానిపై సవివరమైన సమాచారం తెలియాలంటే, ఇంకొంత సమయం పడుతుంది గానీ, ఇంటిదొంగలే ఈ పని చేశారన్నది మాత్రం స్పష్టం.

అయితే ఈ ఉదంతం టాలీవుడ్ లో గత సెంటిమెంట్ లను గుర్తుకు తెస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ “అత్తారింటికి దారేది” సినిమా ఇలాగే రిలీజ్ కు ముందు లీక్ అయ్యి, అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే ‘బాహుబలి పార్ట్ 1, 2’ సినిమాలు ఇలా షూటింగ్ దశలో ఉన్నపుడే లీక్ అయ్యి, సోషల్ మీడియాలో సందడి చేసి ఇండియన్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్లుగా అవతరించిన విషయం తెలియనిది కాదు. దీంతో ఇదే సెంటిమెంట్ ను ‘అరవింద సమేత’కు అప్లై చేస్తున్నారు ఔత్సాహికులు.

దసరా సందర్భంగా అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతున్న ఈ సినిమా కూడా నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని, ఈ ఏడాది ‘రంగస్థలం’ ద్వారా చెర్రీ స్థాపించిన బాక్సాఫీస్ రికార్డులను జూనియర్ ఎన్టీఆర్ తిరగరాస్తాడని అభిమానులు ఉత్సాహంగా చెప్తున్నారు. లీక్ అయిన సన్నివేశాలలో ఉన్న బలం వారికి అంత అనిపించిందో లేక ఇండస్ట్రీలో జరిగిన సెంటిమెంట్లు వీటికి ఊతమిచ్చాయో తెలియదు గానీ, లీకేజ్ పట్ల అభిమానులలో పెద్దగా ఆందోళన కనపడడం లేదు.