jr ntr aravindha sametha 150 crores officialఅగ్ర హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే… రిలీజ్ కు కొద్ది గంటలు ముందు నుండే సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం ప్రారంభం కావడం పరిపాటిగా మారిపోయింది. ఎంత బాగున్నా సినిమా అయినా, అందులో బొక్కలు వెతికి పోస్ట్ లు చేయడం ఇతర హీరోల అభిమానులు సాధారణంగా చేసే పని. నిజానికి ఇలాంటి వాటికి ‘శుభంకార్డు’ వేయాలని ‘భరత్ అనే నేను’ సినిమా రిలీజ్ టైంలో ‘మహేష్ అండ్ కో’ ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కానీ కట్ చేస్తే జరిగిన విషయం ఏమిటంటే… ‘భరత్ అనే నేను’ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల పోస్టర్లు రిలీజ్ చేసి అభిమానుల నెగటివిటీని మరింతగా పెంచారు. అంతకుముందు రిలీజ్ అయిన “రంగస్థలం” సినిమా కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. అలాగే తాజాగా ధియేటర్లలో సందడి చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ “అరవింద సమేత” సినిమా పబ్లిసిటీ కూడా అదే బాటలో పయనిస్తూ… 150 కోట్ల పోస్టర్ ను రిలీజ్ చేసారు.

మళ్ళీ అభిమానుల మధ్య రగడ మొదలు. అభిమానులు మారాలంటూ అగ్ర హీరోలు ఇస్తోన్న పిలుపుకు సరైన న్యాయం జరగాలంటే, ముందుగా మారాల్సింది ఆ అగ్ర హీరోలేనని చెప్పాలి. ఇలా పోటాపోటీగా ఒకరికొకరు కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటే…. అభిమానుల మధ్య సయోధ్య ఎలా కుదురుతుంది? ఇంకా ఫ్యాన్స్ వార్ పెంచడం తప్ప!? అగ్ర హీరోల స్టామినాను నిరూపించుకోవాలని రిలీజ్ చేస్తోన్న ఆ కలెక్షన్స్ పోస్టర్స్ లో “వాస్తవం” ఎంత ఉందన్నది అందరికీ తెలిసిందే.

అయినప్పటికీ సోషల్ మీడియా అభిమానుల కుమ్ములాటలు మాత్రం ఆగవు. అభిమానులను మురిపించడానికి నిర్మాతలు రిలీజ్ చేసే ఈ కలెక్షన్స్ పోస్టర్స్ పై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సినిమా విజయాన్ని కలెక్షన్స్ తో కొలవడం సమంజసమే అయినా… ఇలా వాస్తవానికి దూరంగా ఉండే పోస్టర్లు అభిమానుల మధ్య రగడకు కారణం అవుతున్నాయే తప్ప, నిర్మాతలకు గానీ, హీరోలకు గానీ ఏ మాత్రం ప్రయోజనకారిగా లేవని గమనించాలి.