JPawan Kalyan Controversial words on oldage homesరాజకీయ ప్రక్షాళన… జవాబుదారీతనం… ఆదర్శవంతమైన సిద్ధాంతాలు… ఇవే జనసేన నీతిసూత్రాలుగా చెప్పుకొచ్చిన జనసేన అధినేత నోటి వెంట, నిరంతరంగా విమర్శలకు దారి తీసే వ్యాఖ్యలు కూడా వెలువడుతున్నాయి. గతంలో ‘డబ్బులు తీసుకోండి – ఓటు మాత్రం తనకు వేయండి, ఎందుకంటే తన వద్ద డబ్బులు లేవు’ అంటూ ఎటకారంగా చెప్పినా, అందులో ఉన్న ఆంతర్యం, పవన్ చెప్పుకుంటున్న ఆదర్శ భావాలను ప్రశ్నించేలా చేసింది.

రాజకీయాలను మార్చాలి అంటే ఇదేనా? ఓటును అమ్ముకునే దుస్థితి నుండి ప్రజలను దూరం చేయాల్సింది పోయి, వాటిని ప్రోత్సహించడం ఏంటి? అని తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. అలాగే తాజాగా నిడదవోలులో జరిగిన బహిరంగ సభలోనూ మరోసారి విమర్శలకు తావిచ్చే వ్యాఖ్యలు చేసారు జనసేన అధినేత. అది కూడా వయసు మళ్ళిన తల్లి తండ్రులను బాధ్యతగా చూసుకోవాల్సిన పిల్లల గురించి వ్యాఖ్యానించడం పవన్ ను మరింత ఇరుకున పెడుతోంది.

జనసేన ప్రభుత్వం వస్తే వృద్ధాశ్రమాలను కూడా ప్రభుత్వమే నడిపిస్తుందని, కన్నబిడ్డలకు తల్లి తండ్రులను చూసుకోవడం ఇబ్బంది అయితే జనసేన ప్రభుత్వం అది చేస్తుందని పక్కా నేటితరం రాజకీయ నాయకుడి ఓటు బ్యాంకింగ్ వ్యాఖ్యలు చేసారు. వృద్ధాశ్రమంలోని ఓట్లు కోసం పవన్ ఇంత నీచంగా మాట్లాడతారా? అన్న జుగుప్సాకరమైన అనుభూతులు కలుగక మానదు. ఇవేనా జనసేన ఆదర్శవంతమైన సిద్ధాంతాలు? ఇదేనా పుస్తకాల నుండి పవన్ నేర్చుకున్నది? అన్న విమర్శలు జోరందుకుంటున్నాయి.

తల్లితండ్రులను చక్కగా చూసుకోవాలని ప్రజలకు, తన అభిమానులకు పిలుపునివ్వాల్సింది పోయి, వృద్ధాశ్రమాలను ప్రోత్సహించడం బహుశా పవన్ మార్క్ రాజకీయమేమో అర్ధం కాని పరిస్థితి. రోజురోజుకు పవన్ పై నమ్మకం ప్రజలలో ఎందుకు సన్నగిల్లుతోంది? అంటే ఇలాంటి సెల్ఫ్ గోల్ డైలాగ్స్ పర్యవసానాలే అని పేర్కొనాలి. ఈ విషయంలోనే కాదు కులాల విషయంలోనూ పవన్ ఇదే రకమైన ధోరణితో వెళ్తుండడం కొసమెరుపు.