JP Nadda - KCRఇప్పటివరకు తెలంగాణలోని కేసీఆర్ సర్కారు పై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నా… కేంద్రంలోని పెద్దలు మాత్రం సక్యతతోనే వ్యవహరించారు. రాజ్యసభలో ఆ పార్టీ మద్దతు కోసమన్నట్టు ఢిల్లీ పెద్దలు పెదవి విప్పకపోవడంతో రాష్ట్ర నాయకుల ఆరోపణలకు పెద్దగా విలువ లేకుండా పోయింది. అయితే బీజేపీ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది.

కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ జిల్లా కార్యాలయాలకు భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్‌లో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రూ. 45వేల కోట్లకు పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారని ఆయన మండిపడ్డారు.

“తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానని ఎన్ని ఉద్యోగాలిచ్చారు?. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50వేల ఇళ్ళు కూడా కట్టలేదు. కరోనాను కట్టడి చేయకుండా సీఎం‌ కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదు. లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి’ అని నడ్డా పిలుపునిచ్చారు.

ఇటీవలే ఒక జాతీయ స్థాయి సర్వేలో కేసీఆర్ పలుకుబడి తగ్గుతుందని వచ్చింది. దీనితో రాష్ట్రంలో తాము అధికారం లోకి వచ్చే అవకాశం ఉందని పసిగట్టు కమలనాథులు తమ పంథా మార్చారా? ఈ వైఖరి పార్టీకి రాష్ట్రంలో ఉపయోగపడుతుందా అనేది చూడాల్సి ఉంది.