jp nadda comments on ap governmentఈరోజు సాయంత్రం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో జరిగిన బిజెపి గోదావరి గర్జనలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిజంగా సింహంలానే గర్జించారు. “వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పులున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. చివరికి పంచాయతీ నిధులను సైతం జగన్ ప్రభుత్వం వాడేసుకొంటోంది.

ప్రధాని నరేంద్రమోడీ అధికారం చేపట్టాక దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి చూసి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదు. కనుక ఏపీలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. మిగిలిన అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తుంటే జగన్ ప్రభుత్వం మాత్రం తెలుగు భాషను పక్కన పెట్టి పిల్లలపై బలవంతంగా ఇంగ్లీషు భాష రుద్దుతోంది.

దేశంలో 2014కు మునుపు విద్యుత్‌ సంక్షోభం ఉండేది. కానీ ఇప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం మళ్ళీ విద్యుత్‌ సంక్షోభంలో చిక్కుకుపోయింది….” అంటూ తరువాత కేంద్రప్రభుత్వ గుణగుణాలు కీర్చించుకొన్నారు.

జగన్ ప్రభుత్వం విచ్చల విడిగా అప్పులు చేస్తోందని, పంచాయతీ నిధులు కూడా వాడేసుకొంటున్నారని తెలిసీ కూడా నెల నెలా ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు కేంద్రం ఆయనను ఒట్టి చేతులతో సాగనంపకుండా వందో.. వెయ్యి కోట్లో ఆయన చేతిలో పెట్టి పంపుతూనే ఉంది.

మూడు రోజుల క్రితమే బాండ్స్ వేలం వేయడం ద్వారా మరో రూ.2,000 కోట్లు అప్పు తీసుకొనేందుకు అనుమతించింది. అంతకు ముందు అంటే ఈ నెల 1వ తేదీన జీఎస్టీ బకాయిలలో తెలంగాణకు రూ. 296 కోట్లు విడుదల చేయగా, ఆంధ్రప్రదేశ్‌కి రూ.3,199 కోట్లు విడుదల చేసింది.

ఓ వైపు అప్పులు చేసుకొనేందుకు అనుమతిస్తూ, ఎప్పటికప్పుడు భారీగా నిధులు విడుదల చేస్తున్నది కేంద్రప్రభుత్వమే కదా?విద్యుత్ సంస్కరణల పేరిట వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తే అదనంగా అప్పులు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నది కేంద్రమే కదా?

జగన్ ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ తప్పి 8 లక్షల కోట్లు అప్పులు చేసిందని తెలిసి ఉన్నప్పుడు అడ్డుకోవలసిన బాధ్యత కేంద్రానిదే కదా?కేంద్రం ఇచ్చే పంచాయతీ నిధులను కూడా జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని తెలిసి ఉన్నప్పుడు నిలిపివేయాలి కదా?

దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలని ప్రయత్నిస్తున్న కేంద్రప్రభుత్వం ఏపీలో తన బిజెపి శాఖలకు, కార్యక్రమాలకు కూడా హిందీ పేర్లు పెట్టుకొంటూ తెలుగు భాష గురించి మొసలి కన్నీళ్ళు కార్చడం చాలా విడ్డూరంగా ఉంది కదా?

ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని కాదని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులంటూ ఏపీకి తీరని నష్టం కలిగిస్తుంటే కేంద్రప్రభుత్వం ఏనాడూ ఎందుకు వారించలేదు?

దేశం విద్యుత్‌ సంక్షోభం నుంచి బయటపడిందనుకొంటే మరి ఆంధ్రప్రదేశ్‌ ఈ దేశంలోనే ఉంది కదా?మరి నేటికీ ఇక్కడ విద్యుత్‌ సంక్షోభంలో ఎందుకు ఉంది? ఏపీని ఈ సక్షోభం నుంచి గట్టెకించవలసిన బాధ్యత కేంద్రానికి లేదా?

దేశానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తునప్పుడు ఏపీకి ఎందుకు రావడం లేదని బిజెపి నేతలు ఎప్పుడైనా ఆలోచించారా?

ఏపీ ఇన్ని సమస్యలలో కూరుకుపోయిందని, ఇంకా కూరుకుపోతూనే ఉందని తెలిసి ఉన్నా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోగా పరిస్థితుళు పూర్తిగా దిగజారిపోయేవరకు ఎందుకు ఎదురు చూస్తోంది?అనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తే, ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కూడా అదే చేస్తోంది కదా?ఏపీ పట్ల ఈవిదంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో అధికారంలోకి రాగలమని బిజెపి ఏవిదంగా అనుకొంటోంది?