Josh Ravi sorry to Ram Charanసినీ వేడుకలు జరుగుతున్నాయి అంటే అందులో ఎలాంటి వివాదం బయటకు వస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిధిగా జరిగిన “దర్శకుడు” ఆడియో వేడుక ఎలాంటి వివాదం లేకుండా ముగియడం విశేషం. ముఖ్యంగా ఈ వేడుకలో రామ్ చరణ్ ప్రవర్తించిన తీరుతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ప్రసంగించడంతో పాటు, చూడడానికి కూడా చాలా కూల్ గా, రిలాక్స్డ్ గా కనిపించారు.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ‘జోష్’ రవి హీరో రామ్ చరణ్ గురించి ఓ రెండు ముక్కలు మాట్లాడతారని మైక్ అడుగుతున్నారని యాంకర్ చెప్పగా, స్టేజ్ మీదకు వచ్చిన ‘జోష్’ రవి, తాను వచ్చింది ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలపడానికి అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో అంతా అవాక్కు అవ్వగా, తాను అనుకున్నట్లుగానే ‘దర్శకుడు’ చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపి, స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. అయితే ముఖ్య అతిధిగా విచ్చేసిన చెర్రీ గురించి మరిచిపోయానన్న విషయం గుర్తుకు వచ్చి మళ్ళీ స్టేజ్ ఎక్కారు.

‘మీ సినిమా ద్వారానే తాను పాటల్లో డ్యాన్స్ లు వేసే పాత్రలు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత చాలా సినిమాల్లో పాటల్లో డ్యాన్స్ లు వేశానని, ఈ సినిమాలో కూడా ఓ పాటలో కనిపిస్తానని’ చెప్పిన ‘జోష్’ రవి, మిమ్మల్ని మరిచిపోయినందుకు ‘సారీ’ చెప్పగా, దానికి రామ్ చరణ్ చాలా లైట్ గా తీసుకుంటూ ‘పర్లేదు’ అంటూ ఓ చేయి చూపించారు. ఇటీవల కాలంలో మరో మెగా హీరో బన్నీ ప్రవర్తన హాట్ టాపిక్ గా మారిన నేపధ్యంలో… దానికి పూర్తి విరుద్ధంగా ఆహ్లాదకరంగా చెర్రీ ప్రవర్తించడం విశేషం.

ఇక తాను ప్రసంగిస్తున్న సమయంలో కూడా ఎక్కడ వివాదానికి తావు లేకుండా మెగా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చెర్రీ… ‘బాబాయ్ బాబాయ్…’ అంటూ అరుస్తున్న అభిమానగణాన్ని రెండు సెంటిమెంట్ డైలాగ్స్ తో పడేసాడు. “మనకు నచ్చిన వ్యక్తుల గురించి మనం రోజూ మాట్లాడుకోం… మన అమ్మ గురించి మనం రోజు మాట్లాడుకోం… మనసులో ఉండాలి… మాటల్లో కాదు… నా ఫ్యామిలీ అనేది నా మనసులో ఎక్కువుంటది… మాటల్లో తక్కువుంటది… ప్లీజ్ అర్ధం చేసుకోండి…” అంటూ చేసిన ప్రసంగానికి ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభించింది.