గుమ్మడి కాయ దొంగ భుజాలు తడుముకున్నట్లు!కాదేది కవితకనర్హం అన్నారు ఓ మహానుభావుడు. బహుశా అందుకేనేమో వర్తమాన రాజకీయాలను ఉద్దేశించి ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన ఓ కవిత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఇది మూడేళ్ళ క్రితమే జొన్నవిత్తుల ఆలపించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుందని నెటిజన్లు భావిస్తున్నారో ఏమో గానీ, మళ్ళీ హల్చల్ చేస్తోంది.

ఎన్నికల ప్రచారాలన్నీ కూడా తేలికగా పాడుకునేందుకు ఓ పాట రాసానని చెప్పిన జొన్నవిత్తుల, దానిని ఆలపించి వినిపించారు. “శోభనాలకు మంచాలిస్తాం, కడుపొస్తే కాన్పు చేస్తాం, పిల్లోడికి పేరే పెడతాం ఓటేస్తే… కుల పిచ్చికి స్వాగతమిస్తాం, మత పిచ్చికి మద్దతునిస్తాం, అందరితో ముష్టెత్తిస్తాం గెలిపిస్తే… అంటూ పాడిన పాటకు సదరు యాంకర్ చిరునవ్వులు చిందించారు.

ఇక ప్రభుత్వానికి ఆదాయ వనరులలో ప్రముఖమైన మద్యం విషయంలో మంత్రి మండలి అంతా ఓ గేయాన్ని పాడితే ఎలా ఉంటుందో కూడా ఈ సందర్భంగా తెలిపారు. “తాగరా ఫుల్లుగా తాగరా… నువ్వు తాగకుంటే గవర్నమెంటే నిల్ రా… తాగరా ఫుల్లుగా తాగరా… చీకటైతే బెల్ట్ షాప్ కన్ను కొడతాది, అప్పు చేసి అయిన నిన్ను తాగమంటది, లివర్ వ్యాధి అప్పులే మిగులు చివరకు, నువ్వు చస్తేనేమి బ్రతికితేమి గవర్నమెంట్ కు…!” అంటూ తనదైన శైలిలో ఆలపించారు.

మూడేళ్ళ నాటి వీడియో ఇప్పుడు కూడా సందడి చేస్తుందంటే, అక్షరానికి ఉన్న గొప్పతనం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇందులో జొన్నవిత్తుల గారు ఏ రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించలేదు. అయితే ‘గుమ్మడి కాయ దొంగ భుజాలు తడుముకున్నట్లు’ ఏ పార్టీకి ఈ వీడియో కనెక్ట్ అయితే వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారు.