Jonnalagadda Padmavathy Gadapa Gadapaku Programఅనంతపురం జిల్లాలో శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గడప గడపకి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కెకె అగ్రహారం పంచాయతీ పరిధిలోని సంజీవపురం గ్రామంలో పర్యటించినప్పుడు ఆమెకు క్షేత్రస్థాయిలో తమ పార్టీ తీరు ఏవిదంగా ఉందో అర్దమైంది.

గ్రామ ఉప సర్పంచ్ రాజు, ఆయన సోదరుడు చిన్న రాజు ఎమ్మెల్యే పద్మావతిని కలిసి తమ గోడు మొరపెట్టుకొన్నారు. గ్రామంలో ఉపాధి హామీ పధకం కింద తాము ప్రతీరోజు చెట్లకు నీళ్ళు పెడుతున్నామని కానీ ఇంతవరకు తమ బిల్లులు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ నందీశ్వర్ లంచం ఇస్తేగానీ బిల్లులు రిలీజ్ చేయకుండా అడ్డుపడుతున్నాడని ఫిర్యాదు చేశారు. తాము వైసీపీ కోసం వేలరూపాయలు ఖర్చు చేశామని కానీ చేసిన పనులకు బిల్లులు కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని ప్రభుత్వం కూడా పట్టించుకోదా? అని నిలదీశారు. గ్రామంలో పేరుకే గ్రామ సచివాలయం కానీ దానిలో ఒక్క పనీ అవ్వడం లేదని ఆరోపించారు.

ఎమ్మెల్యే పద్మావతి గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ఉపాధి కూలీలు కూడా ఆమెను నిలదీశారు. తాము రోజంతా కష్టపడి పనిచేస్తే తమ కూలి డబ్బులు పొందాలంటే కూడా లంచాలు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. ఒక్కో కూలి రూ.300 చెల్లిస్తేనే కూలి సొమ్ము బిల్లులు రిలీజ్ చేస్తానని చెపుతూ ఫీల్డ్ అసిస్టెంట్ నందీశ్వర్ తమ బిల్లులు పెండింగులో పెట్టాడని ఎమ్మెల్యే పద్మావతికి ఫిర్యాదు చేశారు.

గ్రామస్తులు రోడ్లు, కాలువలు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పాఠశాలల విలీనంపై ఎమ్మెల్యే పద్మావతిని నిలదీస్తుండటంతో ఆమె అర్దాంతరంగా పర్యటన ముగించుకొని వెళ్ళిపోయారు.

“మీ ఈ జగనన్న పాలనలో దోచుకోవడం దాచుకోవడం లేదు. మద్యలో దళారులు లేరు. లంచాలు లేవు. నేను తాడేపల్లి కూర్చొని బటన్ నొక్కుతుంటే డబ్బు మీ ఖాతాలలో వచ్చి పడిపోతుంటుంది. అంతా పారదర్శకంగా సాగిపోతోందని…” సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటారు. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఈవిదంగా ఉంది.