Joint-Fact-Finding-Committee-Meetingవిభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు జరిగిన న్యాయంపై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విభిన్న ప్రకటనల నేపధ్యంలో… అసలు వాస్తవం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో… ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ పేరుతో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం నాడు ఈ నివేదికను పవన్ కళ్యాణ్ కు అందజేయగా, ఇంతకీ ఈ రిపోర్ట్ లో ఏముంది? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

‘ఫ్యాక్ట్ ఫైండింగ్’ కాబట్టి సహజంగానే కేంద్ర ప్రభుత్వమైన బిజెపి ఏపీకి చేసిన ద్రోహం ఖచ్చితంగా ఉందనేది లభించిన కీలక సమాచారం. అలాగే అవినీతి విషయంలో టిడిపి ప్రభుత్వంలో ఉన్న బొక్కలను కూడా ఈ కమిటీ ఎత్తిచూపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టిడిపి – బిజెపిల వలన రాష్ట్రానికి పెద్దగా చేకూరిన ప్రయోజనం ఏమీ లేదని కమిటీ తన నివేదికగా పవన్ ముందుంచినట్లు తెలుస్తోంది.

‘ప్రత్యేక హోదా’ స్థానంలో ‘ప్రత్యేక ప్యాకేజ్’ను ఇస్తామని ఏపీ ప్రజలను మోసం చేసిన తీరు ఈ నివేదికలో ప్రధాన హైలైట్ గా నిలవనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ శనివారం నాడు అధికారికంగా వెల్లడించనున్నారు. అయితే దీనిని ఎలా ప్రజలకు తెలియజేయాలి? అనే దానిపై కమిటీ సభ్యులతో కలిసి ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ చెప్పే విధానంతోనే పవన్ భవిష్యత్తు రాజకీయాలు ముడిపడనున్నాయి. అందుకే వైసీపీ కూడా ఈ ప్రకటన కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.