john-to-lift-a-car-in-force-2బాలీవుడ్ హీరో జాన్‌ అబ్రహం తాను న‌టిస్తోన్న “ఫోర్స్‌-2” సినిమాలో ఓ సీన్‌లో డూప్ సాయం తీసుకోకుండా రియల్‌ రిస్కీ స్టంట్‌ చేశాడు. గతంలో వచ్చిన “ఫోర్స్” చిత్రంలో డూప్ సాయం లేకుండా జాన్ అబ్రహం ఓ పెద్ద బైక్‌ను ఎత్తి క‌నిపించిన విషయం తెలిసిందే. అప్ప‌ట్లో సినిమాకున్న ప్ల‌స్ పాయింట్స్ లో అది కూడా ఒకటి. అయితే, బైకుని నిజంగా ఎత్తలేదని, ఆ సీన్‌ను ఫోటోగ్రఫీతో మేనేజ్‌ చేశారని జాన్ పై ప‌లువురు ఆరోప‌ణ‌లు గుప్పించారు. దాంతో ప్రేక్ష‌కుల‌ను న‌మ్మించ‌డానికి జాన్ ఆ చిత్ర ప్రచారంలో పాల్గొంటూ అంద‌రి ముందు బైక్‌ని లేపి చూపించాడు.

తాజాగా “ఫోర్స్‌-2” చిత్రంలో కారును ఎత్తే స్టంట్ చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల టాక్. అందుకోసం 1580 కిలోలు బరువున్న బెంజ్‌ కారును డూప్ సాయం లేకుండా జాన్ అబ్రహం ఎత్తాల్సి ఉండ‌గా, ఒక్కడే దాన్ని మోయడం సాధ్యం కాద‌ని, మ‌రో ఇద్ద‌రి సాయంతో జాన్‌ కారు ఎత్తగలిగాడ‌ని దర్శకుడు విపుల్‌ అమృత్‌లాల్‌ షా పేర్కొన్నాడు. చిత్రంలో కారు ఎత్తే సీనుకు అంత‌గా ప్రాధాన్య‌త లేక‌పోయినా సన్నివేశం రియలిస్టిక్‌గా అనిపించడానికి చిత్ర హీరో జాన్ ఈ ప‌నిచేసిన‌ట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.

జాన్ కారును ఎత్తాలనుకోవడం అభినందించ‌ద‌గిన విష‌య‌మ‌ని, సినిమా కోసం ఆయ‌న కష్టపడిన దానిలో వేరే న‌టులు ఉంటే పదో వంతు కూడా చేయలేరని ప్ర‌శంస‌లు కురిపించారు. ఫోర్స్‌-2 ట్రైలర్ వ‌చ్చే శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని, ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.