ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండవ సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ తో ఇండియా అమీతుమీకి సిద్ధమైన విషయం తెలిసిందే. భారతీయులంతా మన జట్టే ఫైనల్ కు చేరాలి, ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి కప్ ను తీసుకురావాలని కోరుకోవడం సహజం. బహుశా బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి అయినా గానీ తమ జట్టే గెలుపొంది, ఫైనల్ లో పాక్ ను మట్టి కరిపించి, కప్ ను ఎగరేసుకుపోవాలని భావిస్తారు. ఇందులో దేశ ప్రేమ తప్ప మరొకటి కనిపించదు.

కానీ ఒక ఇండియన్ అయ్యుండి బంగ్లాదేశ్ గెలవాలని కోరుకుంటే… వారినేమంటారు..? అతనికి కాస్త పైత్యం ముదిరిందేమో అనేది రొటీన్ గా జనాలు చెప్పుకునే మాటలు. అయితే అలా అన్నది ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అయితే… పబ్లిసిటీ కోసం ప్రాకులాడుతున్నారా? అనుకోవాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.

టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ చేస్తున్న సమయంలో… తాను ఫైనల్లో పాకిస్తాన్ – బంగ్లాదేశ్ మ్యాచ్ ను చూడాలనుకుంటున్నానని చేసిన ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక భారతీయుడుగా ఇండియా ఓడిపోవాలని ఎలా కోరుకుంటున్నారు? మానసికంగా ఈ ఎంపీ ఏమైనా తేడానా? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరో విశేషమేమిటంటే… ఈ మహా మేధావి తెలంగాణా ఒలింపిక్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ కావడం..!

బికాంలో ఫిజిక్స్ అని చెప్పిన తర్వాత జలీల్ ఖాన్ ఎంతగా పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. బహుశా దానినే దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి వివాదాస్పద ట్వీట్ చేస్తే పాపులర్ అవుతానని భావించారో లేక నిజంగానే ఈ ఎంపీ ఆలోచనలు తేడానో గానీ… మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం కావాల్సిన పబ్లిసిటీని సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండడం మాత్రం దేశ దౌర్భాగ్యం క్రిందే భావించాలని చెప్పడంలో తప్పు లేదు.