Jio Network Latest Bumper Offerఇప్పటికే ‘ఆల్ ఫ్రీ’ అంటూ వెల్కం ఆఫర్ తో మొబైల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రిలయన్స్ జియో సంస్థ, మరిన్ని సంచలనాలు నమోదు చేసేందుకు సిద్ధమవుతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అతి తక్కువ ధరకే జియో బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం, వెయ్యి రూపాయలకే 4జీ మొబైల్ వంటి సంగతులు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, తాజాగా మరొక వార్త వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా ఉన్న డీటీహెచ్ రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశించనుందని తెలుస్తోంది. అంతేకాదు, జియో సిమ్ మాదిరే ఆదిలోనే అదరగొట్టేందుకు అద్భుతమైన ఫీచర్స్ తో అతి తక్కువ ధరకే ప్రజలకు అందించేందుకు సిద్ధమవుతుందని ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న విషయం. మొబైల్ రంగంలో ఎలాగైతే ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ అండ్ కోకు షాక్ ఇచ్చిందో డీటీహెచ్ రంగంలో కూడా ఎయిర్ టెల్, టాటా స్కై, డిష్ యాజమాన్యాలకు జలక్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సమాచారం.

ప్రస్తుతం ఇతర కంపెనీలు 300 రూపాయలకు ఇస్తున్న మొత్తాన్ని జియో సగానికి తగ్గించేందుకు కసరత్తులు చేస్తోందని, అదే జరిగితే ఇతర కంపెనీలు మూటలు సర్దుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా అన్ని హెచ్ డీ ఛానల్స్ నే వీక్షకులకు అందించాలని యోచనలు చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలలో ఎంత వాస్తవం ఉందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచిచూడాల్సిందే.