Jet carrying venkaiah nidu aborts take offబీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడును విమానం మరో మారు భయపెట్టింది. ఇప్పటికే పలు మార్లు విమాన ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్న వెంకయ్య… తాజాగా ఢిల్లీలో జరిగిన ఘటనతో మరోమారు షాకయ్యారు. వివరాల్లోకెళితే… రాజ్యసభ సభ్యత్వం కోసం రాజస్థాన్ నుంచి నామినేషన్ వేసేందుకు సహచర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో కలిసి ఢిల్లీ నుంచి జైపూర్ కు చార్టెర్డ్ ఫ్లైట్ ఎక్కారు.

వెంకయ్య ఎక్కిన విమానం బయలుదేరేందుకు రెడీ అయిపోయి, రన్ వేపై పరుగులు పెట్టడం ప్రారంభించింది. అయితే ఉన్నట్టుండి ఆగిపోయింది. విమానంలో ఇంధనం అయిపోయినట్లు సంకేతం రావడాన్ని గమనించిన పైలట్ వేగంగా స్పందించాడు. క్షణాల్లో టేకాఫ్ తీసుకోవాల్సిన విమానాన్ని మళ్ళీ వెనక్కు తిప్పాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న వెంకయ్య, రూడీ విమానం దిగేశారు. మరో విమానం కోసం రెండు గంటలు వేచిచూసి, తర్వాత జైపూర్ బయలుదేరారు.

అసలే నామినేషన్ వేసేందుకు వెళుతున్న వెంకయ్య ప్రయాణం ఆలస్యమవడంతో గాభరా పడ్డ రాజస్థాన్ సీఎం వసుంధర రాజే విషయం తెలుసుకుని ఎయిర్ పోర్టుకే నామినేషన్ పత్రాలు తీసుకుని వచ్చారు. ఎయిర్ పోర్టులోనే వాటిపై సంతకాలు పెట్టిన వెంకయ్య అక్కడి నుంచే నేరుగా రాజస్థాన్ అసెంబ్లీకి బయలుదేరారు. నామినేషన్ వేసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయారు వెంకయ్య నాయుడు.