jennings-century-miss-indian-to-win-4th-test-against-englandనాలుగవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా అడుగులు వేస్తోందని చెప్పవచ్చు. ఇంగ్లాండ్ చేసిన 400 పరుగులకు బదులుగా టీమిండియా ఏకంగా 631 పరుగులు నమోదు చేసి, 231 పరుగుల లీడ్ ను అందుకుంది. అయితే ఈ స్థాయిలో పరుగులు చేయడం వెనుక మురళీ విజయ్, విరాట్ కోహ్లి, జయంత్ యాదవ్ లు కీలక భూమిక పోషించారు. ఓపెనర్ గా మురళీ విజయ్ 136 పరుగులతో రాణించగా, కెప్టెన్ విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ముఖ్యంగా స్పిన్నర్ జయంత్ యాదవ్ తో కలిసి 8వ వికెట్ కు 241 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో ఈ మ్యాచ్ ఇండియా వైపుకు తిరిగినట్లయ్యింది. విరాట్ కోహ్లి – జయంత్ యాదవ్ లు కలిసి అద్భుతమైన షాట్లతో అలరించడంతో నాలుగవ రోజు పరుగుల వరద పారింది. ఈ క్రమంలో మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న జయంత్ యాదవ్ తన తొలి టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా డబుల్ సెంచరీని అందుకున్నాడు. వరుసగా మూడు సిరీస్ లలో మూడు డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ గా విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.

జయంత్ యాదవ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత 104 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ కాగా, విరాట్ కోహ్లి 235 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. టీమిండియా బ్యాటింగ్ విభాగంలో నమోదైన మూడు సెంచరీల వెనుక ఓ అరుదైన విషయం దాగి ఉండడం విశేషం. మురళీ విజయ్ ఇన్నింగ్స్ మొదట్లో కీపర్ బెయిర్ స్టో స్టంపింగ్ ను మిస్ చేయగా విజయ్ సెంచరీ సాధించాడు. అలాగే విరాట్ కోహ్లి 60 పరుగుల సమయంలో ఉండగా, స్పిన్నర్ రషీద్ ‘కాట్ అండ్ బౌల్’ చాన్స్ ను మిస్ చేయగా, ఏకంగా డబుల్ సెంచరీ సాధించి, ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించాడు.

అలాగే జయంత్ యాదవ్ ఇన్నింగ్స్ మొదట్లో స్లిప్ లో ఇచ్చిన క్యాచ్ ను రూట్ అందుకోవడంలో విఫలం కావడంతో, జయంత్ కూడా దానిని వినియోగించుకుని సెంచరీని నమోదు చేసి ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చాడు. మూడు అవుట్ లను మిస్ చేయడం ద్వారా ఈ ముగ్గురు నుండి ఏకంగా 470 పరుగులను సమర్పించుకోవాల్సి వచ్చింది ప్రత్యర్ధి జట్టు. మరో విశేషమేమిటంటే… ఇంగ్లాండ్ జట్టులో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన జెన్నింగ్స్ విషయంలో టీమిండియా కూడా సున్నా వద్ద ఉన్నపుడే ఓ తేలికపాటి క్యాచ్ ను వదిలేయడంతో, జెన్నింగ్స్ సూపర్ సెంచరీని నమోదు చేసిన విషయం తెలిసిందే.

దీంతో అవుట్ మిస్సయితే… సెంచరీ కొట్టినట్లే… అని ఫిక్స్ అయిపోవచ్చు. 231 పరుగులు వెనుకబడి రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఓవర్లోనే తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన జెన్నింగ్స్ డకౌట్ గా వెనుతిరగడంతో ఇంగ్లాండ్ పరాజయం ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి.