బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు జేడీఎస్‌ అధినేత కుమారస్వామి నూతన ముఖ్యమంత్రిగా 23న ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌-జేడీఎస్‌ల మధ్య మంత్రి పదవుల పంపకంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

78 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు మొత్తంగా 20 క్యాబినెట్ బెర్తులు, జేడీఎస్ కు 13 రానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితోపాటు పలు కీలక శాఖలు దక్కనున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామి ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థిక శాఖను కూడా తన వద్దే ఉంచుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ నేత జె. పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైన హోంశాఖను అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంకీర్ణ ప్రభుత్వం సవ్వంగా సాగేందుకు రెండు పార్టీలతో కలిసి సమన్వయ సమితిని ఏర్పాటు చెయ్యబోతున్నారు. మంత్రి వర్గ కూర్పుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కుమారస్వామి చర్చిస్తున్నారు.