JD lakshminarayana transferవైయస్ జగన్ కేసుల ద్వారా ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు పరిచయం అవసరం లేని పేరు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. నిర్భయంగా కేసులు దర్యాప్తు చేసి అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నంగా ఉంటారని పేరు తెచ్చుకున్న లక్ష్మీ నారాయణ సీబీఐ జేడీ గా పనిచేసిన కాలంలో జగన్ అక్రమాస్తుల కేసు, సత్యం కుంభకోణం, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓబులాపురం మైన్స్ తదితర కేసులను పరుగులు పెట్టించారు. ఈ కేసులు కీలక మలుపు తీసుకుంటున్న తరుణంలో ఆయన్ని మహారాష్ట్రకు బదిలీ చేశారు. అప్పట్లో ఆయన బదిలీ గురించి ఏపీలో నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి.

ఆ తర్వాత మహారాష్ట్ర లోని ఠాణే సిటీ జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ అక్కడ కూడా మంచి ఖ్యాతిని తెచ్చుకున్నారు. ఇటీవల థానేకు చెందిన బిల్డర్‌ సూరజ్‌ పరిమార్‌ ఆత్మహత్య కేసులో లక్ష్మీనారాయణ యథావిధిగా తన విధులు నిర్వర్తించారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు కార్పొరేటర్లు ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ లక్ష్మీనారాయణను అక్కడి నుంచి బదలీ చేశారు. దీనిపై థానేలో పెద్ద యెత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లక్ష్మీనారాయణను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రశ్నిస్తూ పలుచోట్ల హోర్డింగులు వెలిశాయి. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయనకు అదనపు డిజిపి (అడ్మినిస్ట్రేటివ్‌‌) గా ప్రమోషన్ వచ్చిన కారణంగానే ఆయన బదిలీ జరిగిందని సంజాయిషీ ఇచ్చుకుంటోంది. అయితే, ఈ రాజకీయపు మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.