JD Lakshminarayana - Nadendla Manohar  skipped janasena meetingజనసేన పార్టీ ఎన్నికలలో భారీ అపజయం తరువాత తన మొట్ట మొదటి రివ్యూ సమావేశం మంగళగిరి పార్టీ ఆఫీసులో నిన్న జరిపింది. అయితే ఈ సమావేశానికి జనసేనలో పవన్ కళ్యాణ్ తరువాత కీలక నేతలైన నాదెండ్ల మనోహర్, జేడీ లక్ష్మీనారాయణ రాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. నిరాశాజనకమైన ఫలితాల తరువాత వారి దారి వారు చూసుకోబోతున్నారా అని అనుమానాలు కలుగుతున్నవి. అయితే వారి వారి జిల్లాల సమీక్ష సందర్భంగా వారు హాజరు అవుతారు అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

పార్టీలో కీలక నేతలు సొంత జిల్లాల సమీక్షలకు మాత్రమే వస్తారంటే ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. గతంలోనాదెండ్ల మనోహర్ పార్టీ ప్రతీ కార్యక్రమంలో ఉండేవారు. పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చునే వారు. దీనితో జనసైనికులలో గుబులు మొదలయ్యింది. మరోవైపు నాలుగేళ్ల పార్టీకి ఇన్ని లక్షల ఓట్లు రావడాన్ని విజయంగా భావిస్తున్నామని, తమ పార్టీని ఎదగనివ్వకూడదని కొన్ని బలీయమైన శక్తులు పని చేయడంతో ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు చూడాల్సి వచ్చిందని పవన్ అన్నారు.

తుది శ్వాస వరకు పార్టీని ముందుకు నడిపిస్తానని, సినిమాలలోకి తిరిగి వెళ్తున్నట్టు వచ్చిన వార్తలలో వాస్తవం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు చోట్లా సమయాభావం వల్ల పూర్తి స్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీ భావజాలం, నిర్ణయాలను కార్యకర్తలకు చేరవేసేందుకు జనసేన పార్టీ పక్ష పత్రికను తీసుకు వస్తున్నట్లు పవన్‌ వెల్లడించారు. సెప్టెంబరులో దీని తొలి సంచిక విడుదలవుతుందని పేర్కొన్నారు