jd-lakshminarayana joins janasena partyగత వారం టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కండువ కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు.శనివారం రాత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించిన ఆయన.. ఆదివారం జనసేనాని సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు మీడియా సృష్టేనని, మార్పు కోసమే తాను జనసేనలో చేరానని వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు.

తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారన్నారు. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుల కారణంగా జనసేన మరింతగా జనంలోకి వెళ్తుందని చెప్పారు. ఇదే సమయంలో లక్ష్మీనారాయణను రాజంపేట నుండి గానీ మరేదైనా రాయలసీమ ఎంపీ సీటు నుండి గానీ పోటీ పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ కు ఆయనను సరిగా వాడుకోవడం తెలియడం లేదనే అనుకోవాలి.

రాయలసీమ నుండి పోటీ అంటే గెలవడం దాదాపుగా అసంభవం. కోస్తా నుండి పోటీ చేస్తే గెలవడం తేలిక. లక్ష్మీనారాయణ వంటి వారిని పార్లమెంట్ కు పోటీ పెట్టడం కూడా మంచి పద్దతి కాదు. రాజకీయాలకు కొత్త కాబట్టి శాసనసభకు పోటీ పెట్టడం తెలివైన పని. ఎపిలో సంచలనం సృష్టించిన వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్‌ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసు అప్పటి సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీ నారాయణ 2006 లో డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ సిబిఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఆ తరువాత తను సొంత క్యాడర్ మహారాష్ట్రకు ట్రాన్స్ ఫర్ అయిన ఆయన ఆ రాష్ట్రానికి అడిషనల్ డీజీగా ఉండగా స్వచ్చంద పదవీ విరమణ చేసి రాజకీయాలలోకి వచ్చారు. జేడీ లక్ష్మీనారాయణ కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. అయితే నిజాయితీగల అధికారిగా గానీ కాపు సామాజిక వర్గం వ్యక్తిగా ఎవరికీ తెలీదు.