JD Lakshminarayana joining janasena
మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ చాలా కాలం కిందటే తన రాజకీయ అరంగేట్రం గురించి స్పష్టమైన ప్రకటన చేశారు. గతంలో ఆయన అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన చేరి ఆ పార్టీకు ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. కాకపోతే అది జరగలేదు. ఒక దశలో ఆయన సొంత పార్టీకూడా పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం లక్ష్మీనారాయణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీలో చేరబోతున్నారని సమాచారం.

ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని, లక్ష్మీనారాయణకు పార్టీలో సముచిత గౌరవం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టు సమాచారం. సొంతంగా పార్టీ పెట్టడం వల్ల ఆయనకు ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయనను కన్విన్స్ చేశారట. జేడీ ఆశయాలు తన ఆశయాలు చాలా దగ్గరగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారట. జేడీ లక్ష్మీనారాయణ కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. అయితే నిజాయితీగల అధికారిగా గానీ కాపు సామాజిక వర్గం వ్యక్తిగా ఎవరికీ తెలీదు.

ఎపిలో సంచలనం సృష్టించిన వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్‌ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసు అప్పటి సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీ నారాయణ 2006 లో డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ సిబిఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఆ తరువాత తను సొంత క్యాడర్ మహారాష్ట్రకు ట్రాన్స్ ఫర్ అయిన ఆయన ఆ రాష్ట్రానికి అడిషనల్ డీజీగా ఉండగా స్వచ్చంద పదవీ విరమణ చేసి రాజకీయాలలోకి వచ్చారు.