jd lakshmi narayana to lead Andhra pradesh BJPఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. తాజాగా మాజీ ఉన్నతాధికారి జేడీ లక్ష్మీనారాయణ పేరు తెరమీదకి వచ్చింది. ప్రత్యేకహోదా పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల కారణంగా ఇబ్బంది పడుతున్న పార్టీని ముందుకు నడిపించాలంటే ఇటీవల పదవి నుంచి వైదొలగిన అయనకి అధ్యక్షపదవి కట్టబెడితే బాగుంటుందని యోచిస్తున్నట్లు కొందరు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీలో చేరిన వెంటనే పదవి ఇవ్వడం భాజపా సంప్రదాయాలకు విరుద్ధమైనప్పటికీ ఆ అధికారికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా సముచిత స్థానం కల్పించడంలో తప్పేమీ లేదన్న భావన వ్యక్తమవుతోంది. జేడీ లక్ష్మీనారాయణ గతంలో జగన్ కేసులను హ్యాండిల్ చేసారు కాబట్టి ఆయనను తీసుకొస్తే బీజేపీకి వైకాపాకు లోపాయకారి ఒప్పందం ఉందన్న ఊహాగానాలకు కూడా చెక్ చెప్పొచ్చని అధిష్టానం భావిస్తుంది.

ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉందని చెబుతున్నారు. కన్నా లక్ష్మినారాయణ వైకాపా లో చేరబోతున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నుంచి సోమువీర్రాజు, మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ మాత్రమే బరిలో మిగిలారు. పార్టీలోని సీనియర్లతో చర్చించాక సోమువీర్రాజు పట్ల పార్టీ అధిష్ఠానం అంత సుముఖంగా లేదని ఒక వాదన వినిపిస్తోంది.

ఆకుల సత్యనారాయణ పార్టీకి కొత్తవారు కావడంతో ఆయనకు అవకాశం లేనట్టే. పగ్గాలు తీసుకోవడానికి మాణిక్యాలరావు ఒప్పుకుంటే ఆయన పేరును పరిగణనలోకి తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆయన ఇప్పటికే ఇంట్రస్ట్ లేదని చెప్పేసారట. దీనితో అధ్యక్ష నియామకంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది.