JD-Lakshmi -Narayana-leaving--JanaSena-Partyఇటీవలే జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం అనంతరం జనసేన పార్టీని ప్రక్షాళనకు పూనుకున్నారు పవన్ కళ్యాణ్. జనసేనపార్టీ కమిటీలను పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా పొలిట్‌బ్యూరోలోకి నలుగురిని తీసుకున్నారు. అలాగే 11 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని పార్టీ అధినేత ప్రకటించారు. మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, తమిళనాడు ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, అర్హంఖాన్‌, రాజు రవితేజలను పొలిట్‌ బ్యూరో సభ్యులుగా నియమించారు.

రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ను, క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో తోట చంద్రశేఖర్‌, రాపాక వరప్రసాద్‌ (ఎమ్మెల్యే), కొణిదెల నాగబాబు, కందుల దుర్గేష్‌, కోన తాతారావు, ముత్తా శశిధర్‌, పాలవలస యశస్విని, పసుపులేటి హరిప్రసాద్‌, మనుక్రాంత్‌రెడ్డి, ఎ.భరత్‌ భూషణ్‌, బి.నాయకర్‌లు సభ్యులుగా ఉంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే రెండు కమిటీలలో సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ లేకపోవడం.

ఈ కమిటీలను ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోనే ఉండి గందరగోళం సృష్టిస్తోన్న వారు, ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తున్న వారి వ్యవహారశైలిపై శ్రేణుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పవన్‌ కళ్యాణ్ పరిశీలించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని కమిటీల్లో స్థానం కల్పించారని పార్టీ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు జేడీని ఉద్దేశించినవా అనే అనుమానాలు అభిమానులలో ఉన్నాయి. దీనిబట్టి జేడీ పార్టీ వదిలిపోతారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నికల తరువాత ప్రజాక్షేత్రంలో ఎంతో కొంత యాక్టీవ్ గా ఉన్న జనసేన నాయకుడు ఎవరంటే అది జేడీనే.