JC-Diwakar-Reddy-Tongue-Slip irsk chandrababu naiduఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను… తనకేమీ భయం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసే టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఈ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెట్టె విధంగా ప్రసంగించారు. ఎంతలా అంటే… సిఎం తప్పించుకోవడానికి కూడా లేదన్నట్లుగా బహిరంగ సభలోనే చంద్రబాబును డిమాండ్ చేస్తూ వ్యాఖ్యానించారు జేసీ దివాకర్ రెడ్డి. ఇక్కడ రాయలసీమలో ఒక సమస్య ఉందంటూ మొదలుపెట్టిన జేసీ…

ఈ మధ్య కాలంలో లారీ పళ్ళు అమ్మితే, రెండు టన్నులు, మూడు టన్నులు “సూట్” అంటున్నారని, టన్ను చీనా కాయలు 80 వేల ధర పలుకుతాయని, అయితే దళారులు మాత్రం ‘సూట్’ అంటూ దోచుకుంటున్నారని, దీనిని నియంత్రించాలంటే మీ ఆదేశాలు కావాలని, పోలీసుల్ని ఉపయోగించి ఈ ‘సూట్’ అనే వాళ్లను కంట్రోల్ చేయాలని చంద్రబాబును కోరారు. మరో వైపు జేసీ చెప్తోందంతా వింటున్న చంద్రబాబు, అలాగే చూస్తూ ఉన్న తరుణంలో…

ఇంకా ఆలస్యం చేస్తారెందుకు, ఆ పేపర్ మీద సంతకాలు చేయండి… బహిరంగ వేదిక మీద జేసీ డిమాండ్ చేయడంతో ముఖ్యమంత్రి వర్యులు బాగా ఇబ్బందిపడ్డారు. కొత్తగా ఇవ్వబోయే కాంట్రాక్టులు మాకు అవసరం లేదని, ఎవరికైనా ఇవ్వండి పర్లేదు గానీ, దీనిని నిర్మూలించాలంటూ ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు. సిఎం హావభావాలు పరిశీలించిన తర్వాత… మరో రెండు ముక్కలు మాట్లాడి మైక్ ను చంద్రబాబుకు అప్పగించారు.

బహిరంగ వేడుకలో ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడంతో బహుశా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయేమో గానీ, మైక్ అందుకున్న ముఖ్యమంత్రి, ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని ముగించారు. సాధారణంగా జేసీ వ్యవహార తీరుతో ప్రత్యర్ధి పార్టీ నేతలే ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఈ సారి ఏకంగా చంద్రబాబే అలాంటి అనుభూతులు చవిచూడాల్సి వచ్చింది.