JC Diwakar Reddy Busesమాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతీకారవాంఛ ఎక్కువైందని, ఇందుకోసం తాను కొంత కాలం ట్రావెల్స్ బిజినెస్ నుండి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ప్రత్యర్థులను హింసించే సమయంలో అధికారం శాశ్వతంకాదన్న సంగతి గ్రహించాలని ఆయన హితవు పలికారు.

బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో తనపైనా అనేక ఒత్తిళ్లు తెస్తున్నారని జేసీ ఆరోపించారు. అధికారుల మీద ఎదురు కేసులు వేయటం ప్రారంభించడంతో వాళ్లు కాళ్ల బేరానికి వస్తూ పైవాళ్ల ఒత్తిడి అంటూ చెబుతున్నారన్నారు. రోజూ కేసుల గొడవ ఎందుకని.. ట్రావెల్స్ వ్యాపారం కొంతకాలం మానేయ్యాలని అనుకుంటున్నానని జేసీ చెప్పారు.

నిన్న టీడీపీ నుండి వెళ్ళిపోయిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యల మీద కూడా ఆయన స్పందించారు. టీడీపీ నుంచి బయటకు వెళ్లే వారు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి ఆరోపణలు చేస్తున్నారని, అయితే నాలుగు రోజులు జైల్లో పెట్టినా పర్లేదు అని ధైర్యంగా నిలబడితే పోయేదేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.

వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరితే తనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని రాయభారాలు నడుపుతున్నారని జేసీ ఇప్పటికే చెప్పారు. అయితే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి, బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టు చాలా రోజులుగా వదంతులు వినిపిస్తున్నాయి. అయితే జేసీ మాత్రం తాను రాజకీయాలకు దూరం అంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయన తనయుడు చంద్రబాబు ఏర్పాటు చేసిన యువ నాయకుల మీటింగ్ కు హాజరు అయ్యారు.