JC Diwakar Reddy Says YS bharathi will be CM of andhra Pradesh in an year

సంచలన వ్యాఖ్యలకు పేరొందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు మాజీ ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, మాగంటి బాబు, ఆయన కుటుంబసభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సంవత్సరంలోపు వైఎస్ భారతి (జగన్ సతీమణి) సీఎం కాబోతోందని జేసీ జోస్యం చెప్పారు. ఒకరి మూర్ఖత్వం వల్ల మనకు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శలు గుప్పించారు. విశాఖలో రాజధాని పెట్టాలంటే జగన్‌ నిర్ణయం తీసుకుంటే సరిపోదని.. అందరి అభిప్రాయాలను తీసుకోవాలని చెప్పుకొచ్చారు.

“ఇక్కడ కేవలం కమ్మ వాళ్లే భూములు కొనలేదు. ఒక కులంపై, వ్యక్తిపై ద్వేషంతో ఇలా చేయడం సరికాదు. ఎన్నికల్లో జగన్‌కు కేసీఆర్‌ ఆర్థిక సాయం చేశాడు.. మన రక్తాన్ని పీల్చి జగన్‌.. కేసీఆర్‌కు రెట్టింపు చెల్లించాడు. రాజధానిని శ్మశానం అని మంత్రి బొత్స అన్నాడు. నిజంగా 3 రాజధానులు ఏర్పడితే రాష్ట్రం శ్మశానమే’ అని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతే రాజధాని అని గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. దీన్ని రాజధాని కాదని చెప్పడానికి తాతలు దిగిరావాలి. మనిషికి తల ఎంత ముఖ్యమో రాజధానికి సెక్రటేరియట్‌, అసెంబ్లీ అంతే ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు ఆయన. అదే సందర్భంగా జగన్‌ నమ్మకం పోగొట్టాడు కాబట్టే పరిశ్రమలు వెళ్లిపోయాయని చెప్పుకొచ్చారు ఆయన.