JC Diwakar Reddy Satires on YS Jagan Mohan Reddyజగన్ పాలనపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో మరోసారి ఛలోక్తులు విసిరారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో తాత రాజారెడ్డి మార్క్‌ పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో కమ్మవాళ్లు కృష్ణా, గోదావరిలో కలిసిపోయారని.. నామినేటెడ్‌ పోస్టులు రెడ్లకు ఇచ్చినందుకు జగన్‌ను అభినందిస్తున్నానన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ గట్స్‌ను మెచ్చుకుంటున్నానని.. అయితే చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని విమర్శించారు. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజక్టులపై జగన్ బాగా మాట్లాడారని.. ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవుగా అంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తు చేశారు.

నెల్లూరులో మాఫియాలు ఉన్నాయని ఆనం రామ్ నారాయణ రెడ్డి అనకుండా ఉండాల్సిందన్నారు. ఎక్కడ మాఫియా లేదో చెప్పమనండంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఒకరకంగా జేసీ నవ్వుతూనే జగన్ ప్రభుత్వానికి చురకలు అంటించారని చెప్పుకోవాలి. ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మీద కూడా స్పందించారు.

వర్మకు సినిమా పేరు పెట్టడం తెలియదని.. అసలా సినిమాకు ‘రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం’ అని పేరు పెట్టాల్సిందని వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా ఇటీవలే ఎన్నికలలో ఓడిపోయిన జేసీ తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, తనయుడు పవన్ రెడ్డి నిన్న మీడియా ముందుకు వచ్చారు. తాము టీడీపీలోనే ఉంటాం అని స్పష్టం చేసి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు