JC -Diwakar Reddy - YS Jaganఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన పాలన జనరంజకంగా సాగుతోందని.. జగన్‌కు 100కు 150 మార్కులు వేస్తానని తనదైన శైలిలో దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం.రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్‌ బస్సులు ఉన్నా.. సీఎం జగన్‌కు తన బస్సులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

ఇప్పటివరకు తమ ట్రావెల్స్‌కు చెందిన 31బస్సులను సీజ్ చేశారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్‌ చేశారని విమర్శించారు. జరిమానాలతో పోయే తప్పిదాలకు సీజ్‌ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. “డ్రైవర్ కు డ్రెస్ లేదని, బ్యాడ్జ్ లేదని కూడా బస్సులు సీజ్ చేస్తున్నారు. న్యాయపోరాటం చేస్తాం,” అని చెప్పుకొచ్చారు జేసీ.

ఎందుకు 150 మార్కులు ఇచ్చారని పాత్రికేయులు అడగా.. ఇందుకే ఇలా పాలన చేస్తున్నందుకే అని తనదైన శైలిలో చెప్పారు. జగన్‌ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తమ అబ్బాయేనని జేసీ వ్యాఖ్యానించారు. పరిపాలనలో ఆయన కిందా మీదా పడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జేసీ జగన్ ను తరచూ విమర్శించే వారు… దానికి ప్రతిగానే ఇది జరుగుతుందని పలువురి అభిప్రాయం.

ఇది ఇలా ఉండగా ఎన్నికల ఫలితాలు రాకముందు నుండీ జేసీ కుటుంబం పార్టీ మారుతుందని వార్తలు వచ్చేవి. మొదట్లో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ కు వెళ్తారని ఆ తరువాత బీజేపీ అని అనేవారు. అయితే ప్రస్తుతానికి ఆ రెండు జరగలేదు. ప్రభుత్వ కక్ష సాధింపు నేపథ్యంలో జేసీ ఏం చెయ్యబోతున్నారో చూడాల్సి ఉంది.