JC Diwakar Reddy on elections 2019 expensesఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు 10 వేల కోట్లట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఆయన మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి 10 వేల కోట్లు ఖర్చు చేశాయని చెప్పారు. ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చుపెట్టారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో అయితే కొందరు అభ్యర్థుల ఏకంగా 50 కోట్లు ఖర్చుపెట్టాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించాలనేది తన తపన అని ఆయన అనడం విశేషం.

ఇందుకోసం ఓ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జయప్రకాశ్‌ నారాయణ లాంటి మేధావులతో కలిసి ఈ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుత వ్యవస్థను ఇలాగె వదిలేస్తే ఇక ముందు ఎన్నికల్లో ఒక్కో ఓటుకు 5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. డబ్బు కాదు.. చేసిన పనులను ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే పరిస్థితి రావాలని అందుకోసం కృషి చేస్తానని వివరించారు. ఈ సారి ఎన్నికలలో ఆయన పోటీ చెయ్యలేదు.

ఆయన కొడుకు జేసీ పవన్ రెడ్డి పోటీ చేశారు అనంతపురం ఎంపీగా. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీదే గెలుపని ఆయన వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛనే తమ పార్టీని గెలిపిస్తాయని ఆయన అన్నారు. చంద్రబాబు చేపట్టినన్ని సంక్షేమ పథకాలు ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. అయితే పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛనే లేకపోతే మా గతి అథోగతయ్యేదని ఆయన చెప్పడం విశేషం.