JC - Diwakar Reddyజేసీ దివాకర్ రెడ్డి… రాయలసీమ రాజకీయాల్లో కీలక నేత. అలాగే నిర్మొహమాటంగా మాట్లాడడంలో సిద్ధహస్తుడు. స్వపక్షానికి ఇబ్బంది అనిపించినా, తను అనుకున్నదేదో మొహమాటం లేకుండా చెప్పడంలో ఆరితేరిన జేసీ, తాజాగా తాను ఇబ్బందులలో పడిపోయే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంలో పార్లమెంట్ లో ఉండాల్సిందిగా పార్టీ విప్ జారీ చేసిన విషయం తెలిసిందే.

దీంతో ఎలాంటి కారణాలున్నా ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా పార్లమెంట్ లో హాజరు కావాల్సి ఉంటుంది. అయితే తాను మాత్రం వెళ్ళేది లేదని కుండబద్దలు కొడుతూ చెప్పారు జేసీ. పార్లమెంట్ కు వెళ్లి తాను చేసేదేం లేదని, తాను వెళ్లి ఓటు వేసినా ప్రభుత్వం ఏమీ పడిపోదు గనుక తాను వెళ్ళడం అనవసరం అని, అందుకే ఢిల్లీ వెళ్ళడం లేదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు జేసీ.

అంతేకాదు తనకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు వాళ్ళు ఏం చెప్తున్నారో అర్ధం కాదు, తాను వెళ్ళడం వలన ఎవరికీ ఉపయోగం లేదు అంటూ మరో కారణాలను కూడా ఎత్తిచూపారు. రాష్ట్ర సమస్యలను ఢిల్లీలో వినిపించాలని ప్రజలు గెలిపిస్తే, తాను రాష్ట్రానికే పరిమితం అవుతానంటే మరి ఎంపీ ఎందుకు పోటీ చేసినట్లు? గెలిపించిన ప్రజలకు మరలా ఏం సమాధానం చెప్తారు? జేసీ గారు అది కూడా సెలవిస్తే బాగుండేది.

ఇంగ్లీష్, హిందీ రాదు, ఢిల్లీ వెళ్ళడం కుదరదు… అని నాలుగేళ్ళు ముగిసిన తర్వాత చెప్పడం ఎందుకు? బహుశా వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారేమో గానీ, ఇప్పుడే దానికి గ్రౌండ్ క్లియర్ చేసుకున్నట్లుగా కనపడుతోంది. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా జేసీకే కాదు, పార్టీకి కూడా అత్యంత చేటు చేస్తాయి. ఓ పక్కన టిడిపినే అవిశ్వాసం పెడితే, ఆ పార్టీ ఎంపీలే సభలో లేకపోతే ఇతర పార్టీలకు ఏం సమాధానం చెప్తారు?