JC Diwakar Reddy Sailajanathరాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే విషయం అందరికి తెలిసిందే. కానీ రాజకీయాల్లో ఆధిపత్య పోరుకు మాత్రం అంతం ఉండదు. వారి వారి సమయం వచ్చే వరకు నివురుగప్పిన నిప్పులా మౌనం అనే కవచాన్ని తొడుక్కుని ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు వారిదైన శైలిలో ఎత్తులకు పై ఎత్తులు వేసి వారి ఆధిపత్యాన్ని చాటుకుంటారు.

ప్రస్తుతం అనంతపురం రాజకీయాలు మరో సారి రసవత్తరంగా మారాయి. 2019 ఎన్నికల తరువాత జేసీ దివాకర్ రెడ్డి దాదాపు సైలెంట్ అయిన పరిస్థితి. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల మీటింగ్ లలో కూడా జేసీ జాడ కనిపించిందే లేదు. దీంతో ఇక జేసీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారేమో అనే స్థాయిలో చర్చ కూడా జరిగింది.

కానీ అనుకొనిరీతిలో రాయలసీమను తెలంగాణ లో కలపాలి అనే ప్రతిపాదన ప్రస్తావించడంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జేసీ హాట్ టాపిక్ అయ్యారు. జేసీ కామెంట్స్ కి తెలంగాణ మంత్రుల నుండి అది ముగిసిపోయిన అంశం, రాయల తెలంగాణ అనేది ఎన్నటికీ జరగదు అనే కౌంటర్లు కూడా వచ్చాయి. అంతేకాకుండా రాయలసీమ నాయకులైన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వారు సైతం జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

అయితే తాజాగా ఈరోజు సింగనమలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన వేళ.. ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ శైలజానాథ్ ఇంటికి జేసీ వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా శైలజానాథ్ కి వైసీపీ నుండి భారీ ఆఫర్లే వస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో శైలజానాథ్ తో జేసీ భేటి ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ను అధికార పీఠం ఎక్కించడం ఒక్కటే మార్గం, అందుకే టీడీపీ లో చేరాలంటూ శైలజానాథ్ కి జేసీ స్వయంగా ఆహ్వానం పలికినట్లు సమాచారం. జేసీ మాట్లాడిన తీరు, ప్రస్తావించిన అంశాలతో శైలజానాథ్ కూడా ఒకింత ఆలోచనలో పడ్డట్లు శైలజానాథ్ వర్గీయులు చర్చించుకుంటున్నారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న అసంతృప్తి నాయకులే టార్గెట్ గా జేసీ రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్, వైసీపీ, జనసేన పార్టీల్లో యాక్టివ్ గా పనిచేస్తూ, ఆయా పార్టీల ధోరణి పట్ల అసంతృప్తి గా ఉన్న నాయకులను టీడీపీ వైపుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా పట్టు సాధించాలని జేసీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది.

మరి జేసీ ఎంతమేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే అననే విమర్శ సర్వత్రా వినిపిస్తుంది.