JC Diwakar Reddy Meets BJP spokes person satya kumarప్రతి మూడు నెలలకు ఒకసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి పార్టీని వీడి, బీజేపీలో చేరతారని వార్తలు వస్తుంటాయి. గతంలో జగన్ మీద చేసిన కామెంట్లకు గానూ ఆయన భారీ మూల్యం చెల్లిస్తున్నారు. జగన్ ప్రభుత్వం పనిగట్టుకుని ఆయన ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది.

అయితే జేసీ మాత్రం టీడీపీని వీడేది లేదు అనే అంటున్నారు. బీజేపీ నుంచి తనకు ఆహ్వానం ఎప్పుడో వచ్చిందని, తమ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని, ఎట్టి పరిస్థితిలో బీజేపీలో చేరనని స్పష్టం చేశారు. ఈ విపత్తు కాలంలో రాజకీయాలు మాట్లాడకూడదని, అయితే రాష్ట్రంలో పాలనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన అన్నారు.

వైద్య, పోలీసు సిబ్బంది సేవలు మరువలేనివని జేసీ దివాకర్‌రెడ్డి కొనియాడారు. గతంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)ను ఆక్రమిస్తే బీజేపీలో చేరతానని జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల అనంతపురంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను ఆయన కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

అదే సమయంలో మీడియాతో మాట్లాడుతూ… జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం దేశంలో తగ్గిపోతూ వస్తోందని తెలిపారు. అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకూ తెలుగుదేశంలోనే ఉంటానని దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.