JC Diwakar Reddyసాక్షిలో వచ్చిన ఒక వార్త ప్రకారం సీమలో టీడీపీ కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబం, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు ఆ వార్త సారాంశం. ఇటీవలే రాజకీయాల నుండి విరమించుకుంటున్నా అని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారు ఈ నెల 12న కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఎదుట వీరు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23 లేదా 27న వీరు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. వీరితో రాంమాధవ్‌ చర్చలు జరిపినట్లు సమాచారం. అలాగే బీజేపీ అధినాయకత్వం పరిటాల కుటుంబంతో కూడా చర్చలు జరుపుతుందట. ఇటీవలే ఎన్నికలలో పరిటాల శ్రీరామ్‌ పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే.

రాయలసీమలో ఉన్న మొత్తం సీట్లలో టీడీపీ ఈ సారి కేవలం మూడంటే మూడు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుండి గెలవగా, హిందూపురం, ఉరవకొండలో నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌ మాత్రమే గెలుపొందారు. పార్లమెంట్ సీట్ల విషయంలో అయితే ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. అయితే ఈ కథనం ఎప్పటిలానే సాక్షి టీడీపీలో అభద్రతాభావం సృష్టించే ప్రయత్నమా లేక నిజామా అనేది చూడాల్సి ఉంది.