JC Diwakar Reddy Controversial Comments On YS Jaganఉన్నది ఉన్నట్లు ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా విజయవాడ విచ్చేసిన సమయంలో వర్తమాన రాజకీయాలపై స్పందించారు. లోకేష్ మంత్రి పదవి నుండి రాహుల్ గాంధీ, జగన్ లపై తనదైన శైలిలో స్పందించారు. మంత్రి పదవికి లోకేష్ సర్వవిధాలా అర్హుడేనన్న జేసీ, వైసీపీ ప్రస్తుత స్థితిగతులను వివరించారు.

“వైఎస్సార్సీపీ అనే డ్యాంకు గండిపడిందని, ఇక నీళ్ళు నిలిచే పరిస్థితి లేదని, ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తారో కూడా లెక్క చెప్పలేమని” అన్న జేసీ జగన్ భవిష్యత్తును ప్రస్తావిస్తూ… నిత్యం తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును ప్రస్తావిస్తుంటారని చెబుతున్న క్రమంలో జగన్ ను ‘వాడెబ్బా’ అంటూ సంభోదించారు. అయితే తన పొరపాటు వెంటనే తెలుసుకున్న జేసీ ‘సారీ సారీ’ అంటూ తన మాటను తప్పుగా అర్ధం చేసుకోవద్దని జగన్ కు క్షమాపణలు చెప్పాడు.

‘మావాడు అన్న భావనతోనే ఆ మాట వచ్చింది తప్ప, ఇందులో మరో ఉద్దేశం లేదని, దీనిని జగన్ మరోలా అర్ధం చేసుకోవద్దని, మీడియా మిత్రులూ… మీరు కూడా తప్పుగా రాయవద్దని’ కోరారు. నోరు జారడం అందరికీ సహజంగా ఉండే అంశమే. అయితే వెనువెంటనే తను చేసిన తప్పు తెలుసుకుని ‘క్షమాపణలు’ చెప్పడం జేసీలో చెప్పుకోదగ్గ విషయం. బహుశా అసెంబ్లీలో రోజా కూడా ఇలాగే ప్రవర్తించినట్లయితే ఆమెకు ఇన్ని తిప్పలు వచ్చేవి కాదు కదా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.