JC -Diwakar Reddy - YS Jaganముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఈ 100 రోజుల పాలనను విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం మీడియా ముందుకొచ్చి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈక్రమంలో తరచు విలక్షణమైన వ్యాఖ్యలు చేసే మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి కూడా జగన్ పాలనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్‌ను చేయిపట్టి నడిపించేవాడు కావాలని జేసీ చెప్పుకొచ్చారు. ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూసి లోపాలను సరిదిద్దాలి.. అంతేగాని దాన్ని నేలకేసి కొట్టొద్దని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేదు కానీ.. అలాంటప్పుడు ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమేనని జేసీ జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన.. ‘మా వాడు చాలా తెలివైనవాడు..’ అంటూ వైఎస్ జగన్‌కు జేసీ కితాబిచ్చారు.

రాజధానిని అమరావతి నుండి తరలిస్తారని ఊహాగానాల మీద కూడా దివాకరరెడ్డి స్పందించారు. రాజధాని అమరావతిలోనే ఇక్కడే ఉంటుందని.. ఎక్కడికీ తరలిపోదని మాజీ ఎంపీ జేసీ చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా 100 రోజులైన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం 200 పడకల సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు. అదే సమయంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అనేక వరాలు కురిపించారు.